Danam Nagender

Danam Nagender: సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా.. ఉప ఎన్నికలకు నేను రెడీ!

Danam Nagender: తెలంగాణ హైకోర్టు విధించిన శాసనసభ సభ్యత్వ అనర్హత వేటును దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సమర్థించిన నేపథ్యంలో ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని ప్రకటించారు. చట్టపరంగా చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేయడం తన బాధ్యత అని, అందుకే న్యాయపోరాటం చేశానని వివరించారు. కోర్టు తీర్పు ఇలా వస్తుందని ముందే ఊహించినప్పటికీ, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ నిబంధనల ప్రకారం కొంత ఊరట లభిస్తుందేమోనని భావించి న్యాయస్థానాన్ని ఆశ్రయించానని స్పష్టం చేశారు.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం..
కోర్టులు చెప్పినట్లుగానే తాను మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజాతీర్పు కోరతానని దానం నాగేందర్ వెల్లడించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు తాను సర్వసన్నద్ధంగా ఉన్నట్లు తేల్చిచెప్పారు.
ఖైరతాబాద్‌తో పేగుబంధం..
ఖైరతాబాద్ ప్రజలతో తనకు దశాబ్దాల అనుబంధం ఉందని, తాను గెలిచినా ఓడినా ప్రజలు ఎప్పుడూ తన వెంటే ఉన్నారని గుర్తుచేశారు. ప్రజల కష్టసుఖాల్లో నిత్యం తోడుగా ఉంటున్నానని, రాబోయే ఉప ఎన్నికల్లో వారి ఆశీస్సులు మళ్లీ తనకే లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
ఏ పార్టీ నుంచి పోటీ?
ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గుర్తుపై పోటీ చేస్తారన్న మీడియా ప్రశ్నకు స్పందిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాతే దీనిపై పూర్తి స్పష్టత ఇస్తానని సమాధానమిచ్చారు.
బీఆర్‌ఎస్, ఎంపీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు..
ప్రస్తుత తరుణంలో బీఆర్‌ఎస్‌ పార్టీపై తాను ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయబోనని దానం స్పష్టం చేశారు. ఖైరతాబాద్ ప్రజలకు ఎవరు అండగా ఉన్నారో ఇక్కడి ప్రజలకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు.
ఎంపీ ఎన్నికల్లో ఓటమి వెనుక కారణం..
గతంలో ఓసారి ఉప ఎన్నికలో ఓడిపోయిన తర్వాత తనకు రాజకీయంగా ప్రమోషన్ వచ్చిందని గుర్తుచేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తను ఓడిపోవడానికి కారణం.. తనను ఢిల్లీకి పంపకుండా ఖైరతాబాద్‌లోనే స్థానికంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతోనే ప్రజలు ఆ తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. ఆ సమయంలో సికింద్రాబాద్‌లో తాను ఎంపీగా పోటీ చేసినప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భయపడ్డారా లేదా అన్నది ప్రజలకే తెలుసన్నారు.
జూబ్లీహిల్స్ ఫలితాలే పునరావృతం..

ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తరహా ఫలితాలే పునరావృతమవుతాయని దానం వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడంతో మొదలైన ఈ న్యాయపోరాటం సుప్రీంకోర్టు తీర్పుతో ముగియగా.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక రాకతో నియోజకవర్గంలో సరికొత్త రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *