Ambati Rambabu: మద్యం రవాణా కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దూకుడు పెంచింది. ఈ కేసు విచారణలో భాగంగా మాజీ జలవనరుల శాఖ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
ఈడీకి అంబటి రిప్లై – అనారోగ్య కారణాలతో సమయం కోరిక..
ఈడీ పిలుపుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు లిఖితపూర్వకంగా స్పందించారు. దాదాపు 15 రోజుల క్రితమే తనకు గుండె సంబంధిత శస్త్రచికిత్స జరిగిందని, వైద్యులు స్టంట్లు వేశారని ఈడీ అధికారులకు తెలిపారు.
కోలుకున్నాక వస్తా..
వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం పూర్తి విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్నానని, ఆరోగ్యం కుదుటపడ్డాక అధికారులకు ముందస్తు సమాచారం ఇచ్చి విచారణకు స్వయంగా హాజరవుతానని స్పష్టం చేశారు. ఈడీ దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని సమాధానమిచ్చారు. అయితే ఆయన విజ్ఞప్తిపై ఈడీ అధికారులు ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు.
మరోవైపు ఈ కుంభకోణానికి సంబంధించిన ప్రధాన వ్యక్తులైన మర్రి సుబ్బారెడ్డి, రాయపాటి పురుషోత్తమరావులను ఈడీ అధికారులు గురువారం ఉదయం నుంచి సుదీర్ఘంగా ప్రశ్నించి వారి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు.
గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాలకు సరుకు రవాణా చేసేందుకు ‘సిగ్మా’, ‘ప్రసాద్ ట్రాన్స్‌పోర్ట్’ సంస్థలు దక్కించుకున్న కాంట్రాక్టుల్లో భారీ అక్రమాలు జరిగినట్లు దర్యాప్తు సంస్థ గుర్తించింది.
రూ.15.44 కోట్ల లావాదేవీలు..
మొదటి కాంట్రాక్టు వ్యవధిలో సుమారు 59.14 లక్షల మద్యం పెట్టెల రవాణా జరగ్గా.. సిగ్మా సంస్థ నుంచి సుబ్బారెడ్డి, పురుషోత్తమరావు దాదాపు రూ.15.44 కోట్లు పొందినట్లు ఈడీ విచారణలో ఆధారాలు లభించాయి.
అంబటితో సంబంధాలు – నిధుల మళ్లింపు..
లిక్కర్ రవాణా సబ్-కాంట్రాక్టులు ఎవరికి వెళ్లాయి, నిధులు ఎక్కడికి మళ్లించారు మరియు అంబటి రాంబాబుతో ఉన్న సంబంధాలపై సిట్, ఈడీ అధికారులు వీరిద్దరినీ నిలదీసి వాంగ్మూలం తీసుకున్నారు.
ప్రభుత్వ ఖజానాకు రూ.195 కోట్ల గండి..
మద్యం బాటిళ్ల రవాణా ఛార్జీలను అడ్డగోలుగా, అధిక మొత్తంలో పెంచడం ద్వారా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ.195 కోట్లకు పైగా భారీ నష్టం చేకూర్చారని ఈడీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రవాణా కాంట్రాక్టుల వెనుక ఉన్న అసలు సూత్రధారులు, లబ్ధిదారులను వెలికితీసేందుకే అంబటి రాంబాబును విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.
