Crime News: హైదరాబాద్‌లో వైభవంగా సాగుతున్న వినాయక నిమజ్జన వేడుకల వేళ పెను విషాదం చోటుచేసుకుంది. ట్యాంక్‌బండ్ వద్ద బందోబస్తు విధుల్లో ఉన్న 55 ఏళ్ల సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) కె. వెంకన్న రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా దూసుకొచ్చిన టూ వీలర్ ఆయన్ను బలంగా ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తులు కనీసం ఆగకుండా అక్కడి నుంచి పరారవ్వడంతో ఇది హిట్ అండ్ రన్ కేసుగా మారింది.
ఘటన ఎలా జరిగింది?
హుస్సేన్‌సాగర్‌కు భారీగా విగ్రహాలు తరలివస్తుండటంతో బందోబస్తు నిమిత్తం భద్రాద్రి కొత్తగూడెం టూ టౌన్ ఎస్ఐ వెంకన్న హైదరాబాద్‌కు డిప్యుటేషన్‌పై వచ్చారు. ట్రాఫిక్ కాస్త తగ్గిన సమయంలో మరో కానిస్టేబుల్‌తో కలిసి ఎస్ఐ వెంకన్న రోడ్డు దాటుతున్నారు. సగం రోడ్డు దాటాక వాహనాలను ఆపాలని కానిస్టేబుల్ సైగ చేస్తుండగానే.. విపరీతమైన వేగంతో వచ్చిన టూవీలర్ ముందు కానిస్టేబుల్‌ను, ఆ తర్వాత వెంటనే పక్కనే ఉన్న ఎస్ఐ వెంకన్నను బలంగా ఢీకొట్టింది. ఎస్ఐని ఢీకొట్టిన తర్వాత ఆ టూవీలర్ పక్కనే ఉన్న మరో వాహనాన్ని కూడా తాకింది. అయితే బండిని ఆపకుండా క్షతగాత్రులను గాలికొదిలేసి నిందితులు అక్కడి నుంచి వేగంగా పారిపోయారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత..
ప్రమాద తీవ్రతకు ఎస్ఐ వెంకన్న రోడ్డుపైనే కుప్పకూలి తీవ్ర రక్తస్రావానికి గురయ్యారు. అక్కడే ఉన్న తోటి సిబ్బంది హుటాహుటిన పరుగున వచ్చి, అంబులెన్స్‌లో సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో ఆయన ప్రాణాలు విడిచారు. విధి నిర్వహణలో ఉన్న అధికారి అకస్మాత్తుగా మృతి చెందడంతో తోటి పోలీస్ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి, విషాదం నెలకొన్నాయి. ఈ వార్త తెలిసి ఎస్ఐ స్వగ్రామంలోని ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
కేసు నమోదు – సీసీటీవీల ఆధారంగా దర్యాప్తు..
ఈ దుర్ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ట్యాంక్‌బండ్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహనాన్ని గుర్తించే పనిలో పడ్డారు. ప్రమాదానికి కారణమైన యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
