Damodar rajanarsimha: ఆరోగ్యశ్రీపై విపక్షం చేస్తున్న ఆరోపణలకు ప్రతిస్పందిస్తూ, రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన పలు విషయాలను వివరించారు.
2014-15లో నెలకు కేవలం రూ.35 కోట్లు మాత్రమే ఇచ్చారని గుర్తుచేసిన మంత్రి, తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024లో ఒక్కసారిగా రూ.90 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించామని చెప్పారు. ఇకపై నెలకు రూ.100 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
అలాగే, ఆరోగ్యశ్రీ ప్యాకేజీ రేట్లను సవరిస్తూ, గరిష్ట పరిమితిని రూ.10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. అయితే, నెలకు రూ.500 కోట్లు ఇవ్వాలని చేస్తున్న విపక్షాల డిమాండ్ అసాధ్యమని స్పష్టం చేశారు.
“ఆరోగ్యశ్రీ పెండింగ్ ఇప్పుడే వచ్చిన సమస్య కాదు. ఆసుపత్రులకు నెలనెలా నిధులు విడుదల అవుతున్నాయి. కావాలనే ఈ విషయంలో అనవసర రాజకీయాలు చేస్తున్నారు” అని మంత్రి విమర్శించారు. సమ్మెకు వెళ్ళకుండా, రోగుల కోసం సేవలు ఆపకూడదని ఆసుపత్రులను ఆయన విజ్ఞప్తి చేశారు.