Khammam: ‘మొంథా’ తుపాను ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఖమ్మం నగరంలోని ‘మున్నేరు’ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మున్నేరుకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో, పరివాహక ప్రాంతంలోని కాలనీలను వరద చుట్టుముట్టింది.
వరద ముంపు, పునరావాస చర్యలు
మున్నేరు నది ఉధృతికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం నగరంలోని మోతీనగర్ మరియు బొక్కలగడ్డ కాలనీల్లోకి వరద నీరు చేరింది. ప్రమాద తీవ్రత దృష్ట్యా, అధికారులు వెంటనే అప్రమత్తమై చర్యలు చేపట్టారు. మోతీనగర్‌లోని 35 కుటుంబాలను, బొక్కలగడ్డలో 57 కుటుంబాలను , సురక్షిత ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాలకు తరలించారు.
మున్నేరు పరివాహక ప్రాంతంలోని రాపర్తి నగర్ బీసీ కాలనీ, టీఎన్జీవోస్ కాలనీ, ఏదులాపురం పరిధిలోని కేబీఆర్ నగర్, ప్రియదర్శిని కళాశాల ప్రాంతాల్లోని ఇళ్ల చుట్టూ వరద నీరు చేరింది.
ఇది కూడా చదవండి: Aryan: ఆర్యన్ మూవీ రిలీజ్ వాయిదా?
రోడ్ల మూసివేత, రాకపోకలకు అంతరాయం
ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మున్నేరుకు వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం మున్నేరు వద్ద నీటిమట్టం 24.7 అడుగులకు చేరి, ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. మున్నేరు ఉద్ధృతి కారణంగా వరద నీరు ఖమ్మం-బోనకల్ ప్రధాన రహదారిపైకి చేరింది. ఖమ్మం నగరానికి సమీపంలోని దంసలాపురం వద్ద ఆర్అండ్బీ రహదారిపై ఏకంగా మూడు అడుగుల మేర నీరు నిలిచింది.
దీంతో పోలీసులు తక్షణమే అప్రమత్తమై ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. వాహనాలు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి దారి మళ్లించారు. చింతకాని మండలం రామకృష్ణాపురం సమీపంలో ఉన్నలో లెవెల్ వంతెనపై కూడా వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మున్నేరు నుంచి వచ్చే భారీ వరద ప్రవాహం పాలేరు జలాశయానికి కూడా వచ్చి చేరుతోంది.
రాపర్తి నగర్ బీసీ కాలనీ వద్ద డంపింగ్ యార్డుకు వెళ్లే రహదారి పూర్తిగా కొట్టుకుపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

