Rajat Patidar: క్రికెటర్ రజత్ పాటీదార్ సిమ్ కార్డు గురించి ఒక ఆసక్తికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. రజత్ పాటీదార్ తన పాత మొబైల్ నంబర్ ను కొంతకాలం వాడలేదు. టెలికాం నిబంధనల ప్రకారం, 90 రోజులకు పైగా వినియోగంలో లేని సిమ్ కార్డులను కంపెనీలు ఇతరులకు తిరిగి కేటాయిస్తాయి. ఈ క్రమంలోనే, రజత్ పాత నంబర్ ఛత్తీస్ గఢ్ కు చెందిన మనీష్ బిసి అనే 21 ఏళ్ల యువకుడికి కేటాయించబడింది. మనీష్ కొత్త సిమ్ తో వాట్సాప్ ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఆ నంబర్ కు పాత యజమాని రజత్ పాటీదార్ ఫోటో ప్రొఫైల్ పిక్చర్‌గా కనిపించింది. కొద్దిరోజుల తర్వాత, మనీష్ కు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, యశ్ దయాళ్ వంటి ప్రముఖ క్రికెటర్ల నుంచి ఫోన్ కాల్స్ రావడం మొదలైంది. వీరంతా రజత్ పాటీదార్ తో మాట్లాడాలని ప్రయత్నించారు.
Also Read: Wasim Akram: మహ్మద్ సిరాజ్ పోరాట యోధుడు.. వసీమ్ అక్రమ్ ప్రశంసలు
మొదట అదో ప్రాంక్ కాల్ అని భావించిన మనీష్, తన స్నేహితులతో కలిసి ఆ ఫోన్ కాల్స్ కు బదులిచ్చారు. రజత్ పాటీదార్ తన పాత నంబర్ ను యాక్సెస్ చేయలేకపోవడంతో మధ్యప్రదేశ్ సైబర్ సెల్ కు ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో ఆ నంబర్ మనీష్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు మనీష్ ను సంప్రదించి, పరిస్థితిని వివరించారు. మనీష్ సహకరించడంతో ఆ సిమ్ ను తిరిగి రజత్ పాటీదార్ కు అప్పగించారు. ఈ సంఘటన వల్ల మనీష్ కు జీవితంలో మర్చిపోలేని అనుభవం దక్కగా, ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇది కేవలం టెలికాం కంపెనీల నిబంధనల వల్ల జరిగిన ఒక సాంకేతిక సమస్య అని, ఇందులో ఎవరి తప్పు లేదని పోలీసులు స్పష్టం చేశారు.