Cpi narayana: సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “బీజేపీతో కలిసిన ఏ పార్టీ అయినా అంతరించిపోవడం ఖాయం. అది భస్మాసుర హస్తం లాంటిది” అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ రెండుగా విడిపోయిన ఉదాహరణను చూపిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ, జనసేన పార్టీలకు కూడా భవిష్యత్తులో ఇలాగే పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలు ప్రధాని మోదీకి దాసోహం అయ్యాయని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి కేంద్రానికి వంగిపోతున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. ముఖ్యంగా విశాఖ ఉక్కు పరిశ్రమపై కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని నారాయణ ఆరోపించారు. కావాలనే స్టీల్ ప్లాంట్‌ను నష్టాల్లోకి నెట్టి, తర్వాత అమ్మకానికి పెట్టే యత్నాలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలపై కూడా నారాయణ మండిపడ్డారు. “జీఎస్టీ పేరుతో బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాటు ప్రజలను దోచుకుంది. కార్పొరేట్ సంస్థలకు మేలు చేసి, ఇప్పుడు ఎన్నికల ముందు జీఎస్టీలో మార్పులు చేసి మోసం చేస్తోంది” అని ఆయన విమర్శించారు. జీఎస్టీ స్వరూపాన్ని పూర్తిగా మార్చకపోతే, రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అంతేకాక, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు ప్రధాని మోదీ భయపడ్డారని ఎద్దేవా చేశారు.
అమిత్ షా వ్యాఖ్యలను తప్పుబడిన నారాయణ.. “నక్సల్స్‌ను చంపుతామని చెబుతున్నారు. కానీ వారిని చంపడం ద్వారా వారి సిద్ధాంతం మారుతుందా?” అని ప్రశ్నించారు. గిరిజనుల ఆస్తులను కాజేయడానికే ప్రభుత్వం నక్సల్స్ ఏరివేత పేరుతో నాటకాలు ఆడుతోందని ఆయన ఆరోపించారు. వ్యతిరేక గళం వినిపించిన వారిని ‘ఆపరేషన్ ఖగార్’ పేరుతో అణచివేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.