Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ దిగుమతులపై విధించిన భారీ సుంకాలు ఇప్పుడు న్యాయపరంగా పెద్ద చర్చకు దారి తీశాయి. ఇప్పటికే ఒక ట్రేడ్ కోర్టు ఈ సుంకాల అమలును తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో కోర్టు ట్రంప్‌కు అనుకూలంగా తాత్కాలిక ఊరట ఇచ్చింది.
ఏప్రిల్ 2న ‘లిబరేషన్ డే’ సందర్భంగా పలు దేశాల దిగుమతులపై ట్రంప్ ప్రభుత్వం అధిక సుంకాలు విధించింది. వివిధ సంస్థలు ఈ అంశాన్ని న్యూయార్క్‌లోని అంతర్జాతీయ వాణిజ్య కోర్టుకు తీసుకెళ్లి పిటిషన్లు దాఖలు చేశాయి. ట్రంప్ తన అధికారాలను మించిపోయారని, ఆయన నిర్ణయాలు అమెరికా వాణిజ్య విధానానికి వ్యతిరేకంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
పరిస్థితిని సమీక్షించిన కోర్టు, అధ్యక్షుడికి అంతర్జాతీయ ఆర్థిక ఆంక్షలు విధించే అధికారం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉందని తేల్చింది. దీంతో ట్రంప్ విధించిన సుంకాలు నిలిపివేయబడ్డాయి. అయితే ట్రంప్ ప్రభుత్వం దీనిపై అప్పీల్ దాఖలు చేసింది.
గురువారం (స్థానిక కాలమానం ప్రకారం) మరో కోర్టు ఈ అప్పీల్‌పై విచారణ జరిపింది. ప్రభుత్వ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని, తాత్కాలికంగా దిగువ కోర్టు తీర్పును నిలిపివేసింది. ఫిర్యాదుదారులు జూన్ 5లోగా, పరిపాలనాధికారులు జూన్ 9లోగా తమ అభిప్రాయాలను సమర్పించాల్సిందిగా కోర్టు సూచించింది.
Also Read: Pm modi: ప్రజలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారు..
Trump: కోర్టులో ట్రంప్ ప్రభుత్వం వాదిస్తూ, ప్రస్తుతం పలు దేశాలతో వాణిజ్య చర్చలు జరుగుతున్నాయని తెలిపింది. జూలై 7వ తేదీ వరకు వాటిని ఖరారు చేయాల్సి ఉన్నందున, ఈ వ్యవహారాన్ని సున్నితంగా పరిగణించాలని కోరింది. అలాగే చైనా-అమెరికా ఒప్పందం, భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ వంటి విషయాలను ప్రస్తావిస్తూ, ట్రంప్ తీసుకున్న చర్యల వల్ల ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయని వాదించింది.
అయితే కోర్టు ఈ వాదనలను తిరస్కరించింది. అమెరికా వాణిజ్య విధానాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించడాన్ని అంగీకరించలేమని స్పష్టం చేసింది. ఈ పరిణామాలతో ట్రంప్ తీసుకున్న టారిఫ్ నిర్ణయాలు మరింత న్యాయ పరీక్షను ఎదుర్కొంటున్నాయి.