Mallikarjun Kharge

Mallikarjun Kharge: అస్వస్థతకు గురైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే

Mallikarjun Kharge: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) అధ్యక్షుడు, సీనియర్ పార్లమెంటేరియన్ మల్లికార్జున్ ఖర్గే అనారోగ్యానికి గురయ్యారు. శ్వాసలో ఇబ్బంది, నిరంతర జ్వరంతో ఆయనను మంగళవారం రాత్రి బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో చేర్చినట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం జనరల్ వార్డులోనే చికిత్స పొందుతున్న ఖర్గే ఆరోగ్య పరిస్థితిని నిపుణులైన వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.

ఆసుపత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే జ్వరానికి కారణాన్ని గుర్తించేందుకు అనేక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని ఆసుపత్రి అధికారులు తెలిపారు.

83 ఏళ్ల మల్లికార్జున్ ఖర్గే అక్టోబర్ 2022 నుండి కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీకి జాతీయ వ్యూహాన్ని సిద్ధం చేయడంలో, ఎన్నికల ప్రచారాల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రజాసేవలో ఐదు దశాబ్దాలకు పైగా అనుభవం కలిగిన ఖర్గే, కాంగ్రెస్‌లో అత్యంత గౌరవనీయ నేతల్లో ఒకరుగా నిలిచారు.

ఇది కూడా చదవండి: Women’s ODI WC: శ్రీలంకను చిత్తు చేసిన భారత్.. సత్తాచాటిన దీప్తి శర్మ

ఆసుపత్రిలో చేరిన విషయం బయటకు రావడంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియాలో ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మరోవైపు, పార్టీ సీనియర్ నేతలు కూడా ఖర్గే ఆరోగ్యంపై చింత వ్యక్తం చేశారు.

ఇటీవలి కాలంలో వరుస రాజకీయ పర్యటనలు, సమావేశాల కారణంగా ఆయన ఆరోగ్యం ప్రభావితమైందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కర్ణాటకలో వరదల ప్రభావిత ప్రాంతాలపై పర్యటనలు చేసి, పంట నష్టాన్ని తక్షణమే పరిహరించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరిన విషయం తెలిసిందే. అలసటతో కూడిన ఈ బిజీ షెడ్యూల్‌ కారణంగానే ఆయన ఆరోగ్య పరిస్థితి దెబ్బతిన్నట్లు భావిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *