Telangana:కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ఆ పార్టీ సీనియర్ నేత జీవన్‌రెడ్డి మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీపై, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం, పార్టీ వైఖరిపై బహిరంగంగానే వ్యతిరేకతను వ్యక్తం చేసిన ఆయన.. ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరితోనే తాను రాజకీయాలనే వదులుకుంటానని బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
Telangana:తెలంగాణ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కు చేతులెత్తి మొక్కుతూ జీవన్‌రెడ్డి పై వ్యాఖ్యలు చేయడంపై ఆ పార్టీ వర్గాలతో పాటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అనుచరుడు, కాంగ్రెస్ నాయకుడి హత్యకు నిరసనగా ఆయన నాయకత్వంలో జగిత్యాలలో రాస్తారోకోకు దిగారు. కాంగ్రెస్ రాజ్యంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana:కాంగ్రెస్ రాజ్యంలో కాంగ్రెస్ నాయకులకే రక్షణ కరువైందని జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. జగిత్యాలలో కాంగ్రెస్ రాజ్యం నడుస్తున్నదా? బీఆరెస్ రాజ్యం నడుస్తుందా? అంటూ పోలీసులపై మండిపడ్డారు. ప్రాణహాని ఉన్నదని తెలిసినా పోలీసులు ఏం చేశారని ఈ సందర్భంగా పోలీస్ ఉన్నతాధికారులతో వాగ్యావాదానికి దిగారు.
Telangana:ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్.. జీవన్‌రెడ్డిని అనునయించేందుకు చొరవ తీసుకున్నారు. ఈ సమయంలో జీవన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. చేతులెత్తి మొక్కుతూ మీకు, మీ కాంగ్రెస్ పార్టీకి ఓ దండం.. మమ్మల్ని ఇలా బతకనివ్వండి.. అని అడ్లూరి లక్ష్మణ్‌తో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైనా స్వచ్ఛంద సంస్థ పెట్టుకొని ప్రజలకు సేవ చేస్తా.. అని నిరుత్సాహాన్ని వ్యక్తం చేశారు.
Telangana:కాంగ్రెస్ పార్టీలో బీఆరెస్ ఎమ్మెల్యేలను చేర్చుకొని మమ్మల్ని చంపేస్తున్నారు.. అంటూ జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకాలం మానసిక అవమానాలకు గురవుతున్నా కానీ తట్టుకున్నాం.. అని చెప్పారు. దీంతో ఖంగుతున్న విప్ అడ్లూరి లక్ష్మణ్ మిన్నకుండిపోయారు. ఒక్కసారిగా ఆయన నుంచి వచ్చిన తీవ్రమైన వ్యాఖ్యలను ఊహించలేకపోయాడు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ నేత ఇలా వ్యాఖ్యలు చేయడంపై కార్యకర్తల్లో చర్చనీయాంశమైంది. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీపైనా, ప్రభుత్వంపైనా ఎంతో వ్యతిరేతతో ఉన్నారన్న విషయం బహిర్గతమైంది.