Cold Wave: తెలుగు రాష్ట్రాలను తీవ్రమైన చలి వణికిస్తోంది. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోవడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని పశ్చిమ జిల్లాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. పటాన్‌చెరులో అత్యల్పంగా 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆదిలాబాద్‌లో 9 డిగ్రీలకు పడిపోయింది. ఇలా చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు చేరడం విశేషం. భాగ్యనగరంపై కూడా చలి పంజా విసురుతోంది. హైదరాబాద్ నగరంలో సాధారణం కంటే తక్కువగా 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నగర శివార్లలోని దుండిగల్‌లో 13 డిగ్రీలు, హయత్‌నగర్‌లో 14 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మంచు కురుస్తుండటంతో ఉదయం వేళల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ చలి తీవ్రత ఈ నెల 21వ తేదీ వరకు కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే నాలుగు రోజుల పాటు పశ్చిమ తెలంగాణలో ఉష్ణోగ్రతలు 7 నుండి 9 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Also Read: Hurun India Report 2025: ప్రపంచ సంపన్న కుటుంబాల్లో నంబర్ వన్ దీపిందర్ గోయల్..!
ఆంధ్రప్రదేశ్‌లో కూడా పరిస్థితి తీవ్రంగానే ఉంది. విశాఖ ఏజెన్సీ ప్రాంతాలు మంచు దుప్పటి కప్పుకున్నాయి. అరకు వ్యాలీ, లంబసింగి వంటి పర్యాటక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2 నుండి 5 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై ఏమీ కనిపించని పరిస్థితి నెలకొంది. ఈ చలి గాలుల ప్రభావంతో సామాన్యులు, ముఖ్యంగా నిలువనీడ లేని వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్డు పక్కన నివసించే వారు చలి నుంచి రక్షణ కోసం ఇతరుల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వాతావరణంలో సంభవిస్తున్న ఈ మార్పుల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

