Revanth Reddy: దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, ఇతర పార్టీలు అధికారం కోసం మాత్రమే పనిచేస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వార్షిక న్యాయ సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భాజపా, బీఆర్ఎస్, జేడీ, బీజేడీ, ఆర్‌జేడీ వంటి పార్టీలన్నీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పుట్టుకొచ్చినవేనని ఆయన గుర్తుచేశారు. “ఇతర పార్టీలు ఎన్నికల్లో గెలిస్తే అధికార కుర్చీలో కూర్చుంటాయి, ఓడితే ఇంటికే పరిమితం అవుతాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం గెలిచినా, ఓడినా ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటుంది. మాది ప్రజాపక్షం,” అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
గాంధీ కుటుంబం దేశం కోసం చేసిన త్యాగాలను రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. పాకిస్తాన్‌ను ముక్కలు చేసిన ఘనత ఇందిరాగాంధీదని, తీవ్రవాదంపై పోరాడి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగం చేశారని పేర్కొన్నారు. సోనియా గాంధీ ప్రధాని పదవిని త్యాగం చేసి మన్మోహన్ సింగ్‌ను దేశ ప్రధానిని చేశారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ కోరుకుంటే 2004లోనే కేంద్ర మంత్రి అయ్యేవారని, 2009లోనే ప్రధాని అయ్యేవారని, కానీ పదవులు త్యాగం చేసి పార్టీ సీనియర్లకు అవకాశం కల్పించారని తెలిపారు. రాహుల్ గాంధీ ఒక కార్యకర్తగా ప్రజల కోసం పనిచేశారని, 25 ఏళ్లుగా సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నారని చెప్పారు.
Also Read: Jagadish Reddy: సీఎం రేవంత్ పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనపై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మోదీ నాయకత్వంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, గత 11 ఏళ్లుగా సామాజిక న్యాయం గురించి ఆలోచించడం లేదని ఆరోపించారు. 2001 నుండి మోదీ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ప్రధానిగా 25 ఏళ్లుగా కుర్చీ వదలట్లేదని విమర్శించారు. మోహన్ భాగవత్ 75 ఏళ్లు దాటిన వారు కుర్చీ వీడాలని చెప్పినా, మోదీ దానికి సిద్ధంగా లేరని, ఇదే నిబంధనతో అద్వానీ, మనోహర్ జోషిలను తప్పించారని గుర్తు చేశారు. గతంలో వాజ్‌పేయీ, మోహన్ భాగవత్ కూడా మోదీని పదవి నుంచి తప్పించడానికి ప్రయత్నించినా అది సాధ్యం కాలేదన్నారు.
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పోరాడుతారని, భాజపాకు 150 సీట్లు దాటకుండా చూస్తామని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల స్వాతంత్ర్యం కోసం 140 ఏళ్ల క్రితమే పోరాడి ఆంగ్లేయులను ఓడించిందని, దేశానికి ఏం చేసిందని విమర్శిస్తున్న వారికి ఈ చరిత్ర గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. వక్రమార్గంలో ఉన్న నేతలను దారిలోకి తెచ్చేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుందని పేర్కొన్నారు. దళితులు, ఆదివాసీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కృషి చేస్తుందని పునరుద్ఘాటించారు.