Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం వనదేవతలు సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్నారు. జాతర గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు ఆయన స్వయంగా మేడారానికి వెళ్లి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వనదేవతలకు ప్రీతిపాత్రమైన నిలువెత్తు బెల్లం (బంగారం) సమర్పించారు.
ముఖ్యమంత్రి తులాభారం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తులాభారం వేయగా, ఆయన బరువు 68 కిలోలు తూగారు. ఆ మొత్తానికి సరిపడా బెల్లాన్ని అమ్మవార్లకు సమర్పించారు. ఇది ఆయనకు రెండవసారి. 2024 మహా జాతర సమయంలో కూడా ఆయన 68 కిలోల బరువుతో తులాభారం సమర్పించారు. అప్పటి నుంచి ఇప్పటికీ ఆయన బరువులో ఎలాంటి మార్పు లేకపోవడం విశేషం.
మేడారం మాస్టర్ ప్లాన్ సమీక్ష
మేడారం మాస్టర్ ప్లాన్ పరిశీలనలో భాగంగా ప్రత్యేక హెలికాప్టర్లో సీఎం రేవంత్ మేడారం చేరుకున్నారు. అక్కడ ఆయనకు మంత్రి సీతక్క, మేడారం పూజారులు, ఆదివాసీలు ఘన స్వాగతం పలికారు. పూజారులు, ఆదివాసీల ఆచార సంప్రదాయాలు, డోలి వాయిద్యాలతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన ద్వారం నుంచి లోపలికి వచ్చిన సీఎం, పూజల అనంతరం మేడారం అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈసారి జాతర కోసం కేవలం తాత్కాలిక ఏర్పాట్లు కాకుండా శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా ఆయన అధికారులకు తగిన సూచనలు చేశారు.