Revanth Reddy: హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30లోగా నిర్వహించాల్సిన నేపథ్యంలో, బీసీ రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ సహా అందుబాటులో ఉన్న పలువురు మంత్రులు హాజరుకానున్నారు.
హైకోర్టు ఆదేశాలు, ప్రభుత్వ కసరత్తు
గత కొంతకాలంగా గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ స్థానాలకు ఎన్నికలు జరగకపోవడంపై ఆరుగురు మాజీ సర్పంచులు హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు, సెప్టెంబర్ 30లోగా తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తును ప్రభుత్వం వేగవంతం చేసింది.
ముఖ్యంగా, బీసీ రిజర్వేషన్ల అంశంపై న్యాయ నిపుణులతో కలిసి ప్రభుత్వం సమీక్షించనుంది. ఎన్నికలకు ముందు బీసీ రిజర్వేషన్ల విషయంలో తీసుకోవాల్సిన చర్యలు, ఎదురయ్యే న్యాయపరమైన సవాళ్లపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఈ సమావేశం తర్వాత బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. హైకోర్టు గడువులోగా ఎన్నికలు నిర్వహించాలంటే, బీసీ రిజర్వేషన్ల సమస్యను త్వరగా పరిష్కరించడం ప్రభుత్వానికి అత్యవసరం.