Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో జరిగిన పబ్లిక్ అఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా వార్షిక సదస్సులో పాల్గొన్న ఆయన, “విజన్ తెలంగాణ రైజింగ్ 2047” అంశంపై ప్రసంగించారు.
హైదరాబాద్ విస్తరణ – మెట్రో, ఆర్ఆర్ఆర్ ప్రాధాన్యం
ప్రస్తుతం 70 కి.మీ. పొడవు ఉన్న మెట్రోను 150 కి.మీ.కి విస్తరించే ప్రణాళిక కొనసాగుతోందని సీఎం వివరించారు. ప్రస్తుతం రోజూ 5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తుండగా, వచ్చే ఐదేళ్లలో ఈ సంఖ్యను 15 లక్షలకు పెంచడమే తమ లక్ష్యమని చెప్పారు. హైదరాబాద్‌లో ఆర్ఆర్ఆర్ నిర్మాణం వేగంగా జరుగుతోందని, మూసీ నది తీరం గుజరాత్ సబర్మతీలా మారబోతుందని వెల్లడించారు. ఇందుకోసం మూసీ రివర్‌ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఫ్యూచర్ సిటీ – కొత్త అవకాశాల కేంద్రం
హైదరాబాద్ సమీపంలో కొత్త నగరాన్ని నిర్మించే ప్రణాళికలను సీఎం ప్రకటించారు. 9 వర్టికల్ రంగాలకు ప్రత్యేకంగా ఉండే ఈ నగరానికి “భారత్ ఫ్యూచర్ సిటీ” అని పేరు పెట్టారు. భవిష్యత్ తరాల కోసం అవకాశాలను సృష్టించడమే దీని ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఫ్యూచర్ సిటీని విమానాశ్రయంతో కనెక్ట్ చేసే ప్రత్యేక రహదారి, రైలు మార్గాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Revanth Reddy: కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు!
పెట్టుబడులకు భద్రత – తెలంగాణ ఆహ్వానం
“తెలంగాణలో ఆర్గానిక్ పంటలు పండుతున్నాయి, ఔషధాలు, వ్యాక్సిన్లు పెద్దఎత్తున ఉత్పత్తి అవుతున్నాయి. 40 శాతం బల్క్ డ్రగ్స్ ఉత్పత్తి తెలంగాణదే. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి” అని సీఎం రేవంత్ పారిశ్రామికవేత్తలను కోరారు. డ్రగ్స్ నిర్మూలనలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని గర్వంగా చెప్పారు.
విద్య, క్రీడలు – యువత కోసం విశేష ప్రణాళికలు
సీఎం మాట్లాడుతూ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, మహాత్మా గాంధీ స్ఫూర్తితో దీనిని స్థాపించబోతున్నట్లు తెలిపారు. అలాగే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా ఒలింపిక్స్‌లో భారత యువత మెడల్స్ సాధించేలా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.
భవిష్యత్ లక్ష్యాలు
-
2034 నాటికి తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడం.
-
2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగడం.
-
దేశ జీడీపీలో కనీసం 10% తెలంగాణ నుంచి రావడం.
-
హైదరాబాద్‌ను నెట్ జీరో సిటీగా తీర్చిదిద్దడం.
పెట్టుబడులకై ఢిల్లీ పర్యటన
సీఎం రేవంత్ ఢిల్లీలో అమెజాన్, కార్ల్స్‌బర్గ్, ఉబెర్, గోద్రెజ్ వంటి బహుళ జాతి సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బోర్గే బ్రెండేతో కూడా ముఖాముఖి చర్చలు జరుపుతున్నారు. “2025 డిసెంబర్ 9న తెలంగాణ విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తాం” అని ఆయన స్పష్టం చేశారు.