CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి జిల్లాలో ఇవాళ పర్యటించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట్ నుంచి హెలికాప్టర్లో కుటుంబ సమేతంగా యాదగిరిగుట్టకు బయలుదేరుతారు. ఉదయం 10 గంటలకు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. ఉదయం 11:30 గంటలకు యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ, ఆలయ అభివృద్ధి పనులు, ముఖ్యంగా స్వర్ణతాపడం పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తారు.
మధ్యాహ్నం 1:30 గంటలకు రోడ్డు మార్గంలో వలిగొండ మండలం సంగెం వెళ్లి మూసీని సందర్శిస్తారు. అక్కడే నది మధ్యలో ఉన్న భీమలింగం స్వామిని దర్శించుకొని పూజలు చేస్తారు. మూసీలో కాలుష్యం ఎలా ఉందో పరిశీలిస్తారు. ఆ తర్వాత మూసీ వెంట ధర్మారెడ్డి కాల్వ వరకు పాదయాత్రగా వెళ్తారు. అక్కడి నుంచి నాగిరెడ్డిపల్లి మెయిన్రోడ్డు వైపు నడుస్తారు. మొత్తంగా మూసీ వెంట గంటన్నర పాటు 5 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. ఈ టైమ్ లోనే మూసీ కాలుష్యంపై రైతులు, మత్స్యకారులతో మాట్లాడుతారు. కాలుష్యం కారణంగా వాళ్లకు కలుగుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుంటారు.
ప్రభుత్వం చేపడుతున్న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు గురించి వాళ్లకు వివరిస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. అనంతరం రోడ్డు మార్గాన జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకుంటారు.