Revanth Reddy: హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా చిన్న టేకూరు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ భయానక ఘటనలో 21 మంది మృతి, పలువురు గాయపడినట్లు అధికారులు ధృవీకరించారు. ప్రమాదం సమయంలో బస్సులో మొత్తం 41 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం.
సీఎం రేవంత్ రెడ్డి నిరంతర సమీక్ష
ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఘటనపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. గద్వాల జిల్లా కలెక్టర్, ఎస్పీలు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని ఆయన ఆదేశించారు. గాయపడిన వారికి సమగ్ర వైద్యం అందించాలనీ, మృతుల కుటుంబాలకు తక్షణ సాయం అందించాలనీ సూచించారు.
సీఎం రేవంత్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం బాధిత కుటుంబాల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది:
📞 9912919545 – ఎం.శ్రీరామచంద్ర, అసిస్టెంట్ సెక్రటరీ
📞 9440854433 – ఈ.చిట్టిబాబు, సెక్షన్ ఆఫీసర్
తెలంగాణ ప్రభుత్వ ఎక్స్ గ్రేషియా
ప్రమాదంలో మృతి చెందిన తెలంగాణకు చెందిన ఆరుగురు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా, గాయపడిన వారికి రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము సంతాపం
ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా, గాయపడిన వారికి రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ దుర్ఘటనపై సంతాపం వ్యక్తం చేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
సహాయక చర్యలు కొనసాగుతున్నాయి
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ప్రమాదం రాష్ట్ర ప్రజలను తీవ్రంగా కలచివేసింది. బాధిత కుటుంబాలకు సాయం అందించే దిశగా ప్రభుత్వం, కేంద్రం చర్యలు వేగవంతం చేస్తున్నాయి.

