Cm revanth: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలను పరిశీలించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఇది ఒక విపత్తు. రాజకీయాలకు అతీతంగా, అందరం కలిసి బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించాల్సిన సమయం” అని పేర్కొన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
ప్రమాదం జరిగిన వెంటనే చర్యలు తీసుకున్నాం – సీఎం రేవంత్
ఈ ప్రమాదం జరిగిన వెంటనే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులను హెలికాప్టర్లో హుటాహుటీన ఘటన స్థలానికి పంపినట్టు తెలిపారు. “నేను ప్రతి నిమిషం ఈ సహాయక చర్యలను సమీక్షిస్తున్నాను. ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నాను” అని ఆయన వివరించారు. సహాయక చర్యల్లో 11 కేంద్ర, రాష్ట్ర సంస్థలు పాల్గొంటున్నాయి అని చెప్పారు.
దేవాదుల ఘటనను గుర్తు చేసిన రేవంత్
ఇలాంటి ప్రమాదాలు గతంలో కూడా జరిగిన విషయాన్ని ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి, “దేవాదుల వద్ద ఓ ప్రమాదం జరిగితే, తొమ్మిదేళ్లయినా ఆ ఐదుగురు మృతదేహాలు బయటకు రాలేదు. అప్పుడు ఎవరు జవాబుదారీ?” అని ప్రశ్నించారు.
హరీష్ రావుపై విమర్శలు
“ఎస్ఎల్బీసీ వద్ద ప్రమాదం జరిగితే, ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఎందుకు రాలేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరి, హరీష్ రావు దుబాయ్ వెళ్లి రెండు రోజులు ఎంజాయ్ చేయలేదా? ఆయన ప్రయాణ వివరాలు తీసుకుని చూడండి… దుబాయ్ వెళ్లాడో లేదో తెలుస్తుంది” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
మొత్తంగా, ఎస్ఎల్బీసీ ప్రమాదంపై ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ చర్యలు చేపడుతుందని, బాధిత కుటుంబాలకు పూర్తిగా అండగా ఉంటుందని సీఎం రేవంత్స్పష్టం చేశారు.

