మూసీపై రాద్దాంతం చేస్తున్న వాళ్లు మూసీ పక్కన మూడు నెలలు అయినా ఉండగలరా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్ది.అలా ఉంటే ఆ కిరాయి డబ్బులు నేనే కడతానంటూ కేటీఆర్, ఇతర నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు.మూసీ పునర్జీవనంపై.. హైదరాబాద్ ప్రజల భవిష్యత్‌పై.. మూసీ వల్ల నల్గొండ జిల్లా ప్రజలు పడుతున్న ఇబ్బందులపై.. చర్చించేందుకే ముందుకు రావాలని ప్రతిపక్షాలకు కోరారు.
మూసీ బ్యూటిఫికేషన్ అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ రివర్ బెడ్లో దాదాపు 1600 ఇండ్లు ఉన్నాయని.. ఇప్పటికే అధికారులు వాళ్లతో మాట్లాడారని పేర్కొన్నారు. మూసీ నిర్వాసితులందరిని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. యూ ట్యూబ్ ఛానెళ్లు పెట్టి సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విషం కక్కతున్నారని మండిపడ్డారు. చిన్న వయస్సులోనే నాకు అన్ని వచ్చాయని.. నాకు ఇంకా ఏం అవసరం లేదన్న సీఎం.. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసమే మూసీ ప్రాజెక్ట్ చేపట్టామని క్లారిటీ ఇచ్చారు.
సూచనలు, సలహాలను అసెంబ్లీలోనే చర్చిద్దామని… దీని కోసం సిద్ధంగా ఉన్నట్లు.. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడా ఇక్కడా కాదని.. ఏకంగా అసెంబ్లీలోనే మాట్లాడుకుందామని చెప్పారు. అసెంబ్లీలోకి ఆయా పార్టీల ఎంపీలు వచ్చి మాట్లాడేందుకు అవకాశం ఉంటే.. న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.