CM Chandrababu

CM Chandrababu: జనాభా నియంత్రణ కాదు, నిర్వహణే ముఖ్యం: సీఎం చంద్రబాబు

CM Chandrababu: గతంలో కుటుంబ నియంత్రణను ప్రోత్సహించిన తానే, ఇప్పుడు జనాభా నిర్వహణ అవసరమని చెబుతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. 1985 జూలై 11న ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరిన సందర్భంగా ఐక్యరాజ్యసమితి మొదటిసారి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించిందని ఆయన గుర్తు చేశారు.

గతంలో ఎక్కువ జనాభా ఉన్న దేశాలను చిన్నచూపు చూసేవారని, కానీ ఇప్పుడు జనాభా ఎక్కువ ఉన్న దేశాలపై ఆధారపడే పరిస్థితి వచ్చిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పుడు జనమే ప్రధాన ఆస్తిగా భావించే రోజులు వచ్చాయని, జనాభాను సానుకూల అంశంగా చూడాలని ఆయన నొక్కి చెప్పారు. జనాభా నియంత్రణ కాకుండా, సరైన నిర్వహణే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.

జనాభా పెరుగుదల స్థిరంగా ఉండాలంటే ప్రత్యుత్పత్తి రేటు 2.1గా ఉండాలని, అయితే మన ఆంధ్రప్రదేశ్‌లో ఇది 1.8గా ఉందని, ఇది మెరుగుపడాలని చంద్రబాబు ఆకాంక్షించారు. జనాభా తగ్గిపోతే యువత జనాభా పడిపోయి, ఊహించని సమస్యలు వస్తాయని ఆయన హెచ్చరించారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న భారతదేశం (143 కోట్లు), చైనాను కూడా దాటేసిందని ఆయన గుర్తు చేశారు.

Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు: హిందీపై వ్యతిరేకత వద్దు

CM Chandrababu: యువత పిల్లలను కనడంపై ఆసక్తి చూపడం లేదని, పిల్లల నిర్వహణ ఖర్చు ఎక్కువగా ఉందని భావిస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. వ్యయాలు పెరగడం, సరైన ఆదాయం లేకపోవడం జనాభా పెరుగుదలకు అడ్డంకిగా మారుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమస్యను అధిగమించడానికి సమ్మిళిత వృద్ధి, మంచి విధానాలను తీసుకురావాలని ఆయన సూచించారు.

రాబోయే 20 ఏళ్లలో వచ్చే పెనుమార్పులకు సిద్ధంగా ఉండాలని, ‘వికసిత్ భారత్-2047’ లక్ష్య సాధనకు జనాభా పెరుగుదల కీలకమని చంద్రబాబు అన్నారు. జాయింట్ ఫ్యామిలీలు తగ్గి చిన్న కుటుంబాలు పెరగడం, మహిళల విద్య, పేదరిక నిర్మూలన వంటి అంశాలు జనాభా నియంత్రణకు దోహదపడ్డాయని ఆయన వివరించారు. పాపులేషన్ మేనేజ్‌మెంట్ డ్రాఫ్ట్ పాలసీని ఆవిష్కరించిన సందర్భంగా, భవిష్యత్తులో జనాభా పెరుగుదలకు మంచి పాలసీని తీసుకువస్తామని ఆయన ప్రకటించారు. హైదరాబాద్‌ వంటి నగరాలు అభివృద్ధికి వలస వస్తున్న ప్రజలకు ఉదాహరణ అని ఆయన గుర్తు చేశారు. కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *