CM Chandrababu: ఉత్తరాంధ్రలో వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన, పరిస్థితులపై పూర్తి సమాచారం సేకరించి కీలక ఆదేశాలు జారీ చేశారు.
కలెక్టర్లకు సీఎం ఆదేశాలు
విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలి.వరద ముప్పు ఉన్న ప్రాంతాలను ప్రత్యేకంగా పర్యవేక్షించి, అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.కంట్రోల్ రూమ్ 24 గంటలు అందుబాటులో ఉంచి, ప్రజలకు ఎప్పటికప్పుడు అలెర్ట్లు ఇవ్వాలి.మంత్రులు, విపత్తు నిర్వహణ బృందాలు పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఉండాలి.అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి.
వాతావరణ శాఖ హెచ్చరికలు
ప్రస్తుతం పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 24 గంటల్లో విశాఖపట్నం, విజియానగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
ప్రజలకు నష్టం
అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈదురుగాలులు తీవ్ర ఇబ్బందులు కలిగించాయి. అనంతగిరి మండలం మడ్రేవు గ్రామంలో గాలివానల ప్రభావంతో ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. వర్షం కారణంగా పంటలు తడిసి రైతులు నష్టపోయారు.
సీఎం స్పష్టం
“ప్రజల భద్రతే ప్రాధాన్యం. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని బృందాలు సిద్ధంగా ఉండాలి. అవసరమైతే వెంటనే రక్షణ చర్యలు చేపట్టి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.