CM Chandrababu

CM Chandrababu: సత్యసాయి సేవ, సిద్ధాంతాలు ప్రపంచానికి ఆదర్శం: సీఎం చంద్రబాబు

CM Chandrababu: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు  ఆయన సేవలు, సిద్ధాంతాలను కొనియాడారు. ఈ వేడుకల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మంత్రి నారా లోకేష్ లతో కలిసి పాల్గొన్న సీఎం, సత్యసాయి బాబా అందించిన సేవలు అపారమైనవని, ప్రపంచానికి ఆదర్శమని పేర్కొన్నారు.

సత్యసాయి జీవన సూత్రాలు, విద్యా సంస్థల గొప్పదనం
సత్యసాయి బోధించిన సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే ఐదు సూత్రాలు ప్రపంచాన్ని శాంతి మార్గంలో నడిపించే విలువలని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. సత్యసాయి విద్యాసంస్థలు కేవలం విద్యను మాత్రమే కాకుండా, విద్యార్థులకు ఆధ్యాత్మికత, నైతికత, విలువలు, సేవాభావాన్ని కూడా నేర్పిస్తాయని ప్రశంసించారు. సత్యసాయి వర్సిటీ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, ఈ సంస్థ వ్యక్తిత్వ కేంద్ర నిలయంగా నిలుస్తోందని అన్నారు. ‘అందరినీ ప్రేమించాలి, సేవ చేయాలి’ అనేదే భగవాన్ సాయి సిద్ధాంతమని, సహాయ గుణం కలిగి ఉండాలే కానీ ఎవరినీ నొప్పించకూడదనేది ఆయన ముఖ్య ఉద్దేశమని సీఎం వివరించారు.

Also Read: AP: ఏపీలో మరో 11 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం

సత్యసాయి బాబా చేపట్టిన సేవా కార్యక్రమాల్లో ముఖ్యంగా తాగునీటి ప్రాజెక్టుల గురించి సీఎం ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో లక్షలాది మందికి తాగునీటి సౌకర్యం అందించిన తొలి సేవా కార్యక్రమం ఇదేనని తెలిపారు. తాగునీటి ప్రాజెక్టుల కోసం అవసరమైతే ప్రశాంతి నిలయాన్ని కూడా తాకట్టు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నానని బాబా చెప్పారని, అయితే భక్తుల విరాళాలతో ఆ ప్రాజెక్టులు విజయవంతమయ్యాయని చంద్రబాబు తెలిపారు. సత్యసాయి సేవా సంస్థలో పనిచేస్తున్న వాలంటీర్ల సంఖ్య 7.50 లక్షలు ఉండటం విశేషమని, ఇంతటి శక్తి సామర్థ్యాలు ఏ ప్రభుత్వ లేదా ప్రైవేట్ వ్యవస్థకు కూడా లేవని అభినందించారు.

ఈ సందర్భంగా ప్రారంభించిన సత్యసాయి ట్రైబల్ విమెన్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్ పట్ల సీఎం ఆనందం వ్యక్తం చేశారు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి సత్యసాయి ట్రస్ట్ అందిస్తున్న వైద్య సేవలను ఆయన ప్రశంసించారు. వసుదైక కుటుంబకం (ప్రపంచమంతా ఒకే కుటుంబం) అనే భారత సంస్కృతిని సత్యసాయి బాబా సేవలు, సిద్ధాంతాలు ప్రతిబింబిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *