Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ పునరుద్ధరణపై దృష్టి సారించారు. రాష్ట్రంలో పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో ఆయన కీలక నేతలతో చర్చలు జరిపారు. అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో తెలంగాణకు చెందిన సీనియర్ టీడీపీ నేతలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో తెలంగాణ టీడీపీకి కొత్త అధ్యక్షుడి నియామకం, రాష్ట్ర, మండల స్థాయి కమిటీల ఏర్పాటు, కార్యకర్తల పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలపై లోతైన చర్చ జరిగింది. ఇప్పటికే మండల అధ్యక్షుల నియామకానికి సంబంధించిన కసరత్తు దాదాపు పూర్తయిందని, దీనిని వెంటనే పూర్తి చేయాలని నేతలు అభిప్రాయపడ్డారు.
నేతలు చంద్రబాబుకు వివరించిన వివరాల ప్రకారం, తెలంగాణలో ఇప్పటివరకు 1.78 లక్షల సభ్యత్వ నమోదు పూర్తయింది. గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలు చురుకుగా ఉన్నారని, సరైన నాయకత్వం దొరికితే పార్టీ మళ్లీ క్షేత్రస్థాయిలో బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఆలస్యమైతే తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేసి కార్యకలాపాలు వేగవంతం చేయాలని కూడా సూచించారు.
ఇది కూడా చదవండి: Rohit Sharma: ఏందయ్యా ఇది రోహిత్.. ద్రవిడే వల్లే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం.. గంభీర్ చేసింది ఏం లేదు.!
నేతల సూచనలను పరిశీలించిన చంద్రబాబు, పార్టీ బలోపేతంలో భాగంగా రెండు మూడు రోజుల్లోనే 638 మండల కమిటీలు, డిజవిన్ కమిటీల నియామకాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. వీలైనంత త్వరగా కమిటీల నియామకం పూర్తి చేసి, ప్రతి స్థాయిలో పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేయాలని ఆయన స్పష్టం చేశారు.
అలాగే రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపించగల, కార్యకర్తల్లో నమ్మకాన్ని పెంచగల నాయకుడికే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తామని చంద్రబాబు తెలిపారు. చాలా కాలం తరువాత తెలంగాణ టీడీపీ నేతలతో ఆయన సమావేశం కావడం వల్ల పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ టీడీపీ వ్యవహారాలపై చంద్రబాబు మరింత దృష్టి పెట్టి, రాష్ట్రంలో పార్టీని తిరిగి చైతన్యవంతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.