CM Chandrababu: భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో ‘నవ భారత్’ థీమ్‌తో ఈ వేడుకలను నిర్వహించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ప్రధాన వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
రాష్ట్ర పునర్నిర్మాణమే కూటమి లక్ష్యం:
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం ఎంతో వెనుకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులు, అక్రమాలు రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీశాయని విమర్శించారు. పోలవరం, అమరావతి ప్రాజెక్టులు నిలిచిపోయాయని, పెట్టుబడులు తరలిపోయాయని అన్నారు. ఈ నేపథ్యంలో, రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మించాలనే లక్ష్యంతో తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలిపారు.
పేదలకు సంక్షేమం, మహిళలకు ‘స్త్రీ శక్తి’:
కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే రూ. 40 వేల కోట్ల పైగా సంక్షేమ పథకాలకు ఖర్చు చేశామన్నారు. “తల్లికి వందనం” పథకం కింద రూ. 10 వేల కోట్లతో 67 లక్షల మంది తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేశామని వెల్లడించారు. బి.సి., ఎస్.సి., ఎస్.టి. వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అలాగే, మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ హామీలో భాగంగా ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
Also Read: Pulivendulalo Shivangulu: సీమ శివంగుల ధాటికి వైసీపీ విలవిల
పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులపై సీఎం స్పందన:
రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు తెలిపారు. రాయలసీమకు సాగునీరు అందించేందుకు బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, బనకచర్లతో ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని సీఎం స్పష్టం చేశారు. సముద్రంలోకి వృథాగా పోయే వరద నీటిని మాత్రమే వినియోగిస్తున్నామని, దీనిపై ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.
ఈ వేడుకల్లో భాగంగా వివిధ బెటాలియన్ల పరేడ్, శకటాల ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ స్టేడియం చుట్టూ తిరిగారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.