Mega Parents-Teachers Meeting: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినూత్న కార్యక్రమంగా నిలిచిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ మరోసారి ప్రజల మనసులు గెలుచుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కొంతసేపు తల్లిదండ్రులు, టీచర్లు, విద్యార్థులతో చర్చించారు. పిల్లల చదువు ఎలా సాగుతోంది? వారు ఏయే విషయాల్లో మెరుగుపడాలి? వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. చదువులో మెరుగ్గా రాణించాలని, ఉన్నత ఉద్యోగాల కోసం ప్రయత్నించాలని విద్యార్థులను ప్రోత్సహించారు.
అంతేకాకుండా, తరగతిలోకి వెళ్లి కాసేపు టీచర్‌గానూ మారారు చంద్రబాబు. 8వ తరగతి విద్యార్థులకు స్వయంగా సోషల్ సైన్స్ పాఠం బోధించారు. ఆసక్తికరంగా ఉన్న ఈ తరగతి సమయంలో మంత్రి నారా లోకేష్ కూడా విద్యార్థిలా కూర్చొని శ్రద్ధగా పాఠం విన్నారు. విద్యార్థులు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు.
పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే సాధారణంగా కార్పొరేట్ స్కూళ్లలో మాత్రమే జరిగేది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్లలోనూ దీనిని ప్రోత్సహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. గతేడాది మొదటిసారిగా నిర్వహించిన మెగా పీటీఎం మంచి స్పందన పొందింది. ఈ ఏడాది రెండోసారి మరింత పెద్ద స్థాయిలో నిర్వహించారు.
ఇది కూడా చదవండి: AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం: మాజీ ఐఏఎస్ రజత్ భార్గవకు సిట్ నోటీసులు
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో పెద్ద ఉత్సవంలా ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, అధికారులు, దాతలు, పూర్వ విద్యార్థులు ఇలా లక్షలాది మంది పాల్గొన్నారు. మొత్తం రెండు కోట్లకు పైగా ప్రజలు ఇందులో భాగమయ్యారు.
ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు తమ పిల్లల చదువు గురించి, ప్రవర్తన గురించి తెలుసుకోవచ్చు. వారి అభిప్రాయాలు, సూచనలను నేరుగా ప్రభుత్వానికి చెప్పే అవకాశమిచ్చారు. ప్రతి ఏడాది ఇటువంటి కార్యక్రమాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య మంచి అనుసంధానం ఏర్పడింది. పిల్లల చదువుపై తల్లిదండ్రుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. చదువులో ప్రతి విద్యార్థి మెరుగుపడాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.
సాక్షాత్తు సీఎం టీచర్ అవడం విద్యార్థులకు ఓ ప్రత్యేక అనుభవంగా మారింది!