ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారని సీఎం చంద్రబాబు అన్నారు.గత పాలకులు కేంద్రం ఇచ్చిన నిధులను కూడా దారి మళ్లించి, రాష్ట్రం అభివృద్ధి చెందకుండా అడ్డుకున్నారని దుయ్యబట్టారు.తాను సీఎంగా ఉన్న కాలంలో ఎన్నడూ రాష్ట్రంలో ఇలాంటి దుర్భర పరిస్థితుల్ని చూడలేదన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
భవిష్యత్తులో పార్టీని ముందుకెలా తీసుకెళ్లాలన్న దానిపై సమీక్షించాలని పార్టీ నేతలకు సూచించారు.ప్రస్తుతం జాతీయ స్థాయిలో భాగస్వామ్యంగా ఉన్నామని, మిత్రపక్షాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని తెలిపారు.తాము అధికారం కోసం కాకుండా దేశం కోసం పనిచేశామని పేర్కొన్నారు. ఎన్డీయేతో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా తాము పదవులు అడగలేదన్నారు.
కూటమి అధికారంలోకి రావడానికి క్యాడర్ చాలా త్యాగాలు చేసిందని, వారందరినీ అభినందిస్తున్నానని తెలిపారు.దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన ప్రాంతీయ పార్టీ టీడీపీ అని చెప్పారు. టీడీపీకి విశ్వసనీయత ఉందన్న చంద్రబాబు.. హర్యానాలో ఐదుగంటలపాటు జరిగిన ఎన్డీయే సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ రాబోయే ఎన్నికలకు సమాయత్తం కావాలని ప్రధాని పిలుపునిచ్చినట్లు చెప్పారు.