Cm chandrababu: రాష్ట్రంలోని వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. గత రెండు త్రైమాసికాల్లో ప్రభుత్వ శాఖలు మెరుగైన ఫలితాలు సాధించాయని సీఎం వెల్లడించారు. పాలనలో స్పష్టత, ప్రణాళికాబద్ధమైన నిర్ణయాల వల్ల సానుకూల మార్పులు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు.
రాబోయే కాలంలో 17.11 శాతం ఆర్థిక వృద్ధి (GSDP Growth) సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే సమగ్ర ప్రణాళిక అత్యంత కీలకమని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి ప్రణాళికలతో పాటు జిల్లా స్థాయిలోనూ ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
గతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఆర్థికగా సమాన స్థాయిలో ఉండేవని సీఎం గుర్తు చేశారు. అయితే గత ప్రభుత్వం అవలంబించిన తప్పుడు విధానాలు, అవ్యవస్థిత పాలన కారణంగా ఏపీ వెనుకబడిందని విమర్శించారు. ఆ పరిస్థితుల వల్లే దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ చివరి స్థానానికి చేరిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ప్రస్తుత ప్రభుత్వం ఆ లోపాలను సరిదిద్దుతూ అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్లేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని సీఎం తెలిపారు. ప్రతి శాఖ తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ధారించుకుని ఫలితాల సాధనపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.

