Cm chandrababu: “మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్కరణలు తీసుకురావడం సమాజ అభివృద్ధికి మూలం” అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జీఎస్టీ వ్యవస్థ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్’ ప్రచారంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలైన విద్యార్థులు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన 17 మంది విద్యార్థులు ఈ పోటీల్లో విజేతలుగా నిలిచారు. విజేతలకు సీఎం చంద్రబాబు సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా చిన్నారులతో సీఎం స్వచ్ఛందంగా మాట్లాడారు. “జీఎస్టీ సంస్కరణల వల్ల కలిగే ప్రయోజనాలను మీరు అర్థం చేసుకున్నారా?” అని ఆయన విద్యార్థులను ప్రశ్నించారు. దీనికి విద్యార్థులు స్పందిస్తూ, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ రేటు సున్నా శాతం లేదా 5 శాతం వరకు మాత్రమే ఉందని, దీని వలన ధరలు తగ్గుతున్నాయని తెలిపారు.
“ఎలా చెట్టు నాటిన కొంతకాలానికి ఫలాలు ఇస్తుందో, అట్లానే సంస్కరణల ఫలితాలు కూడా కొంతకాలానికి ప్రజలకు అందుతాయి” అని సీఎం వివరించారు. విద్యార్థులు జీఎస్టీ అంశంపై ఎస్సే రైటింగ్, పెయింటింగ్, ఉపన్యాస పోటీల్లో చురుకుగా పాల్గొనడం, వాటిల్లో విజేతలుగా నిలవడం అభినందనీయమని ఆయన అన్నారు.
జీఎస్టీపై విద్యార్థుల అవగాహన ప్రశంసనీయమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.