New CJI: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (CJI)గా జస్టిస్ సూర్యకాంత్ నియమితులు కానున్నారు. ఈ మేరకు ప్రస్తుత సీజేఐ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ (BR Gavai), సంప్రదాయాన్ని అనుసరించి, అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ సూర్యకాంత్ పేరును తదుపరి సీజేఐగా నియమించాలని కేంద్రానికి అధికారికంగా సిఫారసు చేశారు.
జస్టిస్ సూర్యకాంత్ పేరుపై రాష్ట్రపతి ఆమోదం లభించిన వెంటనే, దేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
నవంబర్ 24న పదవీ బాధ్యతలు
ప్రస్తుత సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నవంబర్ 23న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలోనే, తదుపరి సీజేఐ నియామక ప్రక్రియను కేంద్ర న్యాయశాఖ ప్రారంభించింది.
- పదవీ స్వీకారం: జస్టిస్ సూర్యకాంత్ నవంబర్ 24న 53వ సీజేఐగా పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
- పదవీకాలం: ఆయన దాదాపు 14 నెలల పాటు, 2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకూ ఈ కీలక పదవిలో కొనసాగుతారు.
కీలక తీర్పులతో జస్టిస్ సూర్యకాంత్
హర్యానాలోని హిస్సార్‌లో 1962 ఫిబ్రవరి 10న జన్మించిన జస్టిస్ సూర్యకాంత్, 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. న్యాయ వ్యవస్థలో ఆయన ఎన్నో కీలకమైన కేసుల్లో పాలుపంచుకున్నారు.
ఇది కూడా చదవండి: TTD: తిరుమల పరకామణి కేసుపై హైకోర్టు సీరియస్..!
ముఖ్యమైన తీర్పులలో ఆయన పాత్ర:
- ఆర్టికల్ 370 రద్దు: జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో సహా, భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, అవినీతి, పర్యావరణం, లింగ సమానత్వం వంటి కీలక తీర్పులు ఇచ్చిన ధర్మాసనాల్లో జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు.
- ఓటర్ల జాబూదారీతనం: ఎన్నికల జవాబుదారీతనంపై తన నిబద్ధతను చాటుకుంటూ, బిహార్ ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది వివరాలను వెల్లడించాలని ఇటీవల ఎన్నికల కమిషన్‌ను ఆయన ఆదేశించారు.
- మహిళా రిజర్వేషన్: సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌తో సహా బార్ అసోసియేషన్లలో మూడింట ఒక వంతు సీట్లు మహిళలకు రిజర్వ్ చేయాలని ఆయన చారిత్రక ఆదేశాలు సైతం ఇచ్చారు.
- ఇతర కీలక కేసులు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలపై దర్యాప్తునకు ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించిన ధర్మాసనంలో, రక్షణ బలగాలకు ఓఆర్ఓపీ (OROP) స్కీమ్‌ను ధ్రువీకరించిన ధర్మాసనంలోనూ ఆయన సభ్యుడిగా ఉన్నారు. అలాగే సంచలనం సృష్టించిన పెగాసస్ స్పైవేర్ కేసును విచారించిన ధర్మాసనంలోనూ ఆయన ఉన్నారు.
జస్టిస్ సూర్యకాంత్ నియామకంతో, సుప్రీంకోర్టు చరిత్రలో ఆయన తనదైన ముద్ర వేయబోతున్నారు.

