Chittoor: చిత్తూరు జిల్లా శుక్రవారం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో జిల్లాలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగిపోయాయి. వాగులు, వంకలు ఉప్పొంగి పొంగిపొర్లుతున్నాయి.
వర్షాల ప్రభావంతో జిల్లాలోని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ జలాశయానికి వరద ప్రవాహం భారీగా చేరుతోంది. నీటి ఇన్ఫ్లో పెరగడంతో అధికారులు 6 గేట్లు ఎత్తి, దిగువకు నీరు విడుదల చేశారు.
ప్రవాహం తీవ్రంగా ఉండటంతో పెనుమూరు, నంగనూరు పరిసర ప్రాంతాల ప్రజలకు అధికారులు అలర్ట్ జారీ చేశారు. స్థానికులు నీవా నది పరివాహక ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు.
ప్రస్తుతం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుండగా, పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తగిన చర్యలు తీసుకునేందుకు రెవెన్యూ, నీటిపారుదల శాఖలు సిద్ధంగా ఉన్నాయి.