Chiranjeevi: ప్రజల ప్రేమ, అభిమానాలు, తాను చేసిన సేవా కార్యక్రమాలే తనకు రక్షణ కవచాలని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. తాను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, కొంతమంది నాయకులు, సోషల్ మీడియాలో తనపై విమర్శలు చేస్తుంటారని, అయితే వాటిపై తాను స్పందించనని స్పష్టం చేశారు. ఫీనిక్స్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి, యువ హీరో తేజ సజ్జాతో కలిసి రక్తదానం యొక్క ప్రాముఖ్యతను వివరించారు.
చిరంజీవి మాట్లాడుతూ, తన బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు ఒక జర్నలిస్టు రాసిన ఆర్టికల్ స్ఫూర్తి అని గుర్తు చేసుకున్నారు. “ఆ జర్నలిస్టును నేను ఇప్పటివరకు చూడలేదు, కానీ ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆయన రాసిన కథనం నాలో ఒక ఆలోచనను రేకెత్తించింది, దాని ఫలితమే ఈ బ్లడ్ బ్యాంక్” అని చిరంజీవి భావోద్వేగంగా చెప్పారు.
Also Read: War 2: హృతిక్, ఎన్టీఆర్ డ్యాన్స్ గ్లింప్స్‌తో మ్యూజికల్ మ్యాజిక్ సృష్టించనున్న మేకర్స్
తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, కొందరు నాయకులు తనను విమర్శిస్తున్నారని, ఇటీవల అలాంటి ఒక సందర్భం గురించి చిరంజీవి వివరించారు. “ఒక రాజకీయ నాయకుడు నన్ను విమర్శించిన తర్వాత, ఒక ప్రాంతంలో అతనికి ఒక మహిళ ఎదురై ‘చిరంజీవిని ఎందుకు అలా మాట్లాడారు’ అని నిలదీసింది. ఆ మహిళ బిడ్డ నా బ్లడ్ బ్యాంక్ ద్వారా ప్రాణాలు దక్కించుకుందని తెలిసి నా హృదయం ఉప్పొంగింది. మాటల కంటే నా మంచే సమాధానం చెబుతుంది” అని చిరంజీవి అన్నారు. సోషల్ మీడియా ట్రోల్స్‌పై తాను మాట్లాడకపోయినా తాను చేసిన మంచే మాట్లాడుతుందని ఆయన పేర్కొన్నారు.
తన అభిమానులు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా రక్తదానం చేస్తూ, తన పేరును మరింత ముందుకు తీసుకెళ్తున్నారని చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. “నాలాగా మంచి చేసే వారికి ఎప్పుడూ అండగా ఉంటాను. మనల్ని ఎవరైనా మాటలు అంటే, మన మంచితనమే వారికి సమాధానం చెబుతుంది” అని చిరంజీవి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తన బిడ్డలాంటి తేజ సజ్జాతో కలిసి పాల్గొనడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

