Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు కలిసినట్టు, 30% వేతన పెంపు డిమాండ్ అంగీకరించినట్టు మీడియాలో వచ్చిన వార్తలపై ఆయనే స్వయంగా స్పందించారు. ఈ వార్తలు పూర్తిగా తప్పుడు వేనని ఆయన ఖండించారు.
సోషల్ మీడియా వేదికగా స్పందించినచిరంజీవి ఇలా అన్నారు — “నా దృష్టికి వచ్చిన విషయం ఏమిటంటే, ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులమని చెప్పుకునే కొందరు వ్యక్తులు మీడియా ముందు తప్పుడు ప్రకటనలు చేశారు. నేను వారిని కలసి, వారి డిమాండ్లను అంగీకరించానని ప్రచారం చేయడం పూర్తిగా అసత్యం. వాస్తవానికి, నేను ఫెడరేషన్‌కి చెందిన ఎవరినీ ఇప్పటివరకు కలవలేదు.”
చిరంజీవి ఇంకా పేర్కొన్నారు — “ఇది పరిశ్రమ మొత్తానికి సంబంధించిన విషయం. నేను సహా ఎవ్వరూ వ్యక్తిగతంగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం లేదా హామీ ఇవ్వడం సాధ్యం కాదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఫిల్మ్ ఛాంబర్‌నే అగ్ర సంస్థ. అన్ని వర్గాలతో చర్చలు జరిపి, న్యాయమైన పరిష్కారం తీసుకురావడం ఫిల్మ్ ఛాంబర్ సమిష్టి బాధ్యత.”
చివరగా, ఆధారంలేని, గందరగోళం సృష్టించే ఉద్దేశ్యంతో చేసిన ప్రకటనలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు మెగాస్టార్ స్పష్టం చేశారు.