Chhattisgarh: ప్రపంచం అత్యాధునిక కాలానికి ఎంత వేగంగా పరుగులు తీస్తున్నదో.. అంతే వేగంగా మూఢనమ్మకాలు వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. అక్షరాస్యత పెరుగుతున్నా కొద్దీ, అంధ విశ్వాసాలు మితిమీరిపోతూనే ఉన్నాయి. భక్తిమాటున కొందరు ఆసరా చేసుకొని అమాయకుల ధన, మాన, ప్రాణాలను హరించి వేస్తున్నారు. ఇలాంటి కోవలోనే తాంత్రికుడి మాటలు విని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఓ ఘటన చోటుచేసుకొని వ్యక్తి తన ప్రాణంమీదికే తెచ్చుకున్నాడు.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఆనంద్ యాదవ్ అనే వ్యక్తి దంపతులకు పెళ్లయి చానా ఏళ్లు గడిచినా పిల్లలు కలుగలేదు. ఆ దంపతులు దవాఖానలు తిరిగారు. ఫలితం దక్కలేదు. గుడులు, గోపురాల చుట్టూ తిరిగి పూజలు, పునస్కారాలు చేసినా ఆ ఇల్లాలి కడుపు పండలేదు. ఈ దశలో ఎవరో చెప్పిన మాట విని ఆ దంపతులు ఓ తాంత్రికుడి వద్దకు వెళ్లారు. పిల్లలు కలిగే మార్గం చెప్పాలని వేడుకున్నారు.
Chhattisgarh: ఆ దంపతుల కోర్కెను ఆసరా చేసుకున్న ఆ తాంత్రికుడు విచిత్ర మార్గం చెప్పాడు. బతికి ఉన్న కోడి పిల్లను మింగితే సంతానం కలుగుతుందని సలహా ఇచ్చాడు. ఆతడి సలహా మేరకు ఆనంద్ యాదవ్ బతికి ఉన్న కోడిపిల్లను అమాంతం మింగేశాడు. ఇంకేముంది.. ఆ కోడిపిల్ల అతడి గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక అతడు ప్రాణాలిడిచాడు.
Chhattisgarh: అయితే పోస్టుమార్టం చేయగా ఆనంద్ యాదవ్ గొంతులో కోడిపిల్లను వైద్యులు గుర్తించారు. దానిని బయటకు తీయగా విచిత్రమేమో కాని అది బతికే ఉన్నది. మూఢనమ్మకాల వలలో పడి ఇలా ఎందరో అమాయకలు బలవుతూనే ఉన్నారు. ఎందరో ధనాన్ని పోగొట్టుకుంటున్నారు. మరెందరో ఇతర ఆస్తిపాస్తులను కోల్పోతున్నారు. ఎన్నిచట్టాలు వచ్చినా, చైతన్యం తెచ్చినా ఈ మూఢ విశ్వాసాల నుంచి మానవుడు బయటపడలేకపోతున్నాడు.

