Chappell to Shaw: అత్యుత్తమ ఆటతీరుతో కోట్లాది అభిమానులను రంజింపజేసిన పృధ్వీషా భావి సచిన్ గా పండితులనుంచి కితాబందుకున్న విషయం మనకు తెలిసిందే. అలాంటి బ్యాటర్ ఇపుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. కనీసం రంజీ జట్టులో కూడా స్థానం దక్కక సంక్షోభం లో కూరుకుపోయాడు. అయితే అతనికి ఆసీస్ దిగ్గజం, టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ ఛాపెల్ నుంచి మద్దతు లభించింది.
భారత క్రికెట్‌లో ఒకప్పుడు పృథ్వీ షా (Prithvi Shaw) అంటేనే ఓ సంచలనం. ఈ ముంబై కుర్రాడు మైదానంలో అడుగుపెడితే చాలు రికార్డులు ట్టే బద్ధలయ్యేవి. భారత జట్టుకు సచిన్ వారసుడు దొరికేసినట్లేనని అప్పట్లో మాజీ ఆటగాళ్లు కితాబిచ్చారు. కానీ, ఈ యంగ్‌స్టర్ విషయంలో అంతా తలకిందులైంది. జాతీయ జట్టులో కాదు కదా.. కనీసం రంజీ టీమ్‌లో కూడా అతడికి చోటు దక్కలేదు. ఇటీవలే ముంబై సెలెక్టర్లు రంజీ జట్టు నుంచి పృథ్వీని తప్పించారు. ఈ సమయంలో భారత జట్టు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ (Greg Chappell) అతడికి బాసటగా నిలుస్తున్నాడు.
ఇది కూడా చదవండి: PV Sindhu: వచ్చే ఒలింపిక్స్ లోనూ ఆడతా.. ఫిట్నెస్ పై సింధు ధీమా
Chappell to Shaw: ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) వదిలేసిన బాధ నుంచి తేరుకోకముందే పృథ్వీ షాకు ముంబై సెలెక్టర్లు మరో షాకిచ్చారు. ఫామ్, క్రమశిక్షణ కారణాలను చూపుతూ అతడిపై వేటు వేశారు. భారత జట్టుకు మళ్లీ ఆడే అవకాశాలు చేజారుతున్న వేళ పృథ్వీకి ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, టీమిండియా మాజీ కోచ్ అయిన చాపెల్ ఓ లేఖ రాశాడు. ‘హలో పృథ్వీ.. ఇప్పుడు చాలా సంక్లిష్టమైన దశలో నువ్వున్నావ్. అది నాకు అర్థమవుతోంది. ముంబై జట్టులో స్థానం కోల్పోవడం నిన్ను ఎంతగానో బాధించే విషయమే. ప్రతి క్రీడాకారుడి జీవితంలో ఎత్తు పల్లాలు సహజమనే విషయాన్ని గుర్తుపెట్టుకో. క్రికెట్ లెజెండర్లలో మేటి డాన్ బ్రాడ్‌మన్‌కు కూడా ఇలాంటి పరిస్థితి తప్పలేదు. ఆయన సైతం కొన్నిసార్లు జట్టులో చోటు కోల్పోయాడు. అనంతరం సత్తా చాటి మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఇకపై ఆటపై బాగా దృష్టి పెట్టు. ఎలాంటి సలహాలు కావాలన్నా నన్ను సంప్రదించు’ అని చాపెల్ ఓ ఊరడించే లేఖ రాశాడు.
అయితే నెటిజన్లు ఛాపెల్ స్పందనపై భిన్నంగా ప్రతిస్పందిస్తున్నారు. కోచ్‌గా ఉన్న సమయంలో భారత జట్టును దివాళా తీయించిన చాపెల్.. పృథ్వీకి ఉచిత సలహాలు ఇవ్వడం భలే వింతగా ఉందంటున్నారు కొందరు టీమిండియా మాజీ ఆటగాళ్లు కూడా. 2005 నుంచి 2007 మధ్య గ్రెగ్ ఛాపెల్ భారత జట్టుకు కోచ్‌గా ఉన్నాడు. నాటి కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఫిట్‌నెస్, ప్రవర్తన పై చాపెల్ పదేపదే బీసీసీఐకి మెయిల్స్ పెట్టడం పెద్ద దుమారమే రేపింది. ఓ రకంగా దాదా కెరీర్ ముగియడానికి అతడే పునాది వేశాడని అందరూ అంటుంటారు. ఇపుడు పృధ్వీషా ను ఏం చేస్తాడోనంటూ తమత్కరిస్తున్నారు క్రికెట్ లవర్స్.