Chandrababu: శ్రీ సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాల సందర్భంగా ప్రశాంతి నిలయంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయిబాబా సేవలను, ఆధ్యాత్మిక మార్గాన్ని కొనియాడుతూ భావోద్వేగ ప్రసంగం చేశారు.
సత్యసాయి బాబా సేవ, ప్రేమకు ప్రతిరూపమని, విశ్వశాంతి, సర్వమానవ సంక్షేమం ఆయన మార్గమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భూమిపై మనకు తెలిసిన, మనం చూసిన దైవస్వరూపం శ్రీ సత్యసాయి బాబా, అని ఆయన అభివర్ణించారు. “మానవసేవే మాధవసేవ” అని నమ్మి, దాన్ని ఆచరించి చూపిన వ్యక్తి సత్యసాయి అని, ఆయన ప్రపంచమంతా ప్రేమను పంచారని సీఎం అన్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు చాలా మంది సత్యసాయి గొప్పదనం గురించి చెప్పేవారని గుర్తు చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Rahul Sipligunj Wedding: పెళ్లి తేదీ ఫిక్స్.. మీరు తప్పకుండా రవళి.. సీఎంని ఆహ్వానించిన రాహుల్
సత్యసాయి ట్రస్ట్ చేపట్టిన సేవలను ప్రశంసిస్తూ, ప్రభుత్వాల కంటే కూడా వేగంగా, సమర్థవంతంగా సత్యసాయి స్పందించేవారని సీఎం అన్నారు. సత్యసాయి ఆశీస్సులతోనే తాగునీటి పథకాన్ని అందించామని, ట్రస్ట్ ద్వారా 1,600 గ్రామాల్లోని 30 లక్షల మందికి తాగునీరు అందించారని సీఎం గుర్తు చేసుకున్నారు. అంతేకాక, సత్యసాయి 102 విద్యాలయాలు నెలకొల్పారని, అనేక వైద్యాలయాలను స్థాపించి పేదలకు ఉచిత వైద్యం అందించారని పేర్కొన్నారు.
నేడు 140 దేశాల్లోని 200 కేంద్రాల్లో సత్యసాయి ట్రస్ట్ సేవలందిస్తోందని, ఈ ట్రస్ట్‌కు ఏకంగా 7 లక్షల మందికిపైగా వాలంటీర్లు ఉన్నారని ఆయన వెల్లడించారు. సత్యసాయి ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలని, ఆయన చూపిన మార్గంలోనే మనం ముందుకు వెళ్లాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ శత జయంత్యుత్సవాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రకటించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

