CM Chandrababu: హరియాణా గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న బండారు దత్తాత్రేయను ‘జెంటిల్‌మెన్‌కి ప్రతిరూపం’గా అభివర్ణించిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన ఆత్మకథ “ప్రజలే నా ఆత్మకథ” పుస్తకావిష్కరణ సందర్భంగా హైదరాబాదులో శిల్పకళా వేదికపై ప్రసంగించారు. దత్తాత్రేయను ప్రజలందరూ ప్రేమగా ‘దత్తన్న’గా పిలుచుకుంటారని, సాధారణ కార్యకర్త స్థాయి నుంచి జాతీయ నేతగా ఎదిగిన ఆయన రాజకీయ జీవితం ఆదర్శంగా నిలిచిందన్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ, “దత్తాత్రేయ జనహితాన్ని కోరుకునే నాయకుడు. ఆయన లౌకికవాదానికి మద్దతు ఇచ్చినవారు. మత సామరస్యానికి ప్రతీకగా ‘అలయ్ బలయ్’ కార్యక్రమం ద్వారా అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తెచ్చారు. ఆయన రాజకీయాల్లో వ్యత్యాసాలు లేని నాయకుడు. ప్రభుత్వాల్ని, ముఖ్యమంత్రుల్ని ప్రజాసమస్యలపై లేఖల ద్వారా కోరినవారు. లేఖల అంబాసిడర్‌గా గుర్తింపు పొందారు,” అని వివరించారు.
ఇది కూడా చదవండి: Cm revanth: ప్రజల కథే నా ఆత్మకథ” పుస్తకావిష్కరణ – దత్తాత్రేయ జీవితాన్ని ప్రశంసించిన సీఎం రేవంత్ రెడ్డి
అంతేగాక, హైదరాబాద్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన దత్తాత్రేయ ఉత్తర, దక్షిణ భారత ప్రజలతో మమేకమయ్యారని అన్నారు. భారతదేశం త్వరలో నంబర్ వన్ దేశంగా ఎదగబోతుందని ఆశాభావం వ్యక్తం చేసిన చంద్రబాబు, తెలుగుజాతి అగ్రస్థానానికి చేరాలన్న సంకల్పంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
దత్తాత్రేయ జీవితం రాజకీయ శ్రద్ధ, మానవ విలువలు, సామాజిక సమరస్యతకు ప్రతీకగా నిలుస్తుందని ఈ కార్యక్రమం మరోసారి నిరూపించిందని చంద్రబాబు స్పష్టం చేశారు.

