CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి నియోజకవర్గంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSMEలు) ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సేవారంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. “సేవారంగం నుంచి ప్రస్తుతం రాష్ట్రానికి కేవలం 6.3 శాతం ఆదాయమే వస్తోంది. దీనిని విస్తరించితే రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరుగుతుంది,” అని అన్నారు.
స్వర్ణాంధ్ర కార్యాలయాల ప్రారంభం
CM చంద్రబాబు తన కార్యాలయం నుంచి వర్చువల్‌గా ‘స్వర్ణాంధ్ర’ కార్యాలయాలను ప్రారంభించారు. ‘స్వర్ణాంధ్ర – 2047’ దృష్ట్యా అభివృద్ధిని వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి జరగాలన్నదే తమ లక్ష్యమన్నారు.
టెక్నాలజీ కీలకం, డిజిటల్ భవిష్యత్తుపై దృష్టి
టెక్నాలజీ భవిష్యత్తులో కీలక పాత్ర పోషించబోతోందని సీఎం అన్నారు. “డ్రోన్లు భవిష్యత్ యుద్ధాల్లో కీలకంగా మారతాయి. మనం ఇప్పటినుంచే సాంకేతికతపై దృష్టి పెట్టాలి,” అని తెలిపారు. డిజిటల్ ఆవిష్కరణలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను MSME రంగంతో కలిపి రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేస్తామని తెలిపారు.
సంక్షేమ పథకాలు – తల్లికి వందనం, మహిళల ప్రయాణం ఉచితం
ఈ నెలలోనే “తల్లికి వందనం” అనే పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అలాగే, ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని తెలిపారు. “దీపం-2” పథకం కింద ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నట్టు తెలిపారు.
విశాఖ అభివృద్ధి, పోలవరం టార్గెట్
విశాఖపట్నాన్ని ముంబయిలా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం చెప్పారు. ఇప్పటికే ఐటీ కంపెనీలు, పరిశ్రమలు విశాఖ వైపు ఆకర్షితమవుతున్నాయని వివరించారు. విశాఖ రైల్వే జోన్ పనులు ప్రారంభమైనట్టు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. ప్రాజెక్టు ఆలస్యంగా పూర్తవుతున్నందున డయాఫ్రం వాల్ నిర్మాణ వ్యయం రెండున్నర రెట్లు పెరిగిందని తెలిపారు.
Also Read: TPT TEMPLE COMMITTEES: ఆ పోస్టు పెద్దిరెడ్డి కోవర్టుకా? పార్టీ కోసం కష్టపడ్డ నేతకా?
ఆర్థిక అసమతుల్యతపై సమీక్ష
తలసరి ఆదాయాన్ని ప్రతి ఏడాది సమీక్షించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. “విశాఖలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది. కానీ శ్రీకాకుళం వంటి జిల్లాలు వెనకబడి ఉన్నాయి. అందుకే అభివృద్ధి సమాంతరంగా ఉండాలి,” అని పేర్కొన్నారు.
P-4 కార్యక్రమానికి ప్రాధాన్యత
పీఫోర్ (P-4) అనే కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమతుల్యంగా కొనసాగించడం ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించి, వాటిని అమలు చేయడమే తమ ముఖ్య ఉద్దేశమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అభివృద్ధి మార్గంలో ఆంధ్రప్రదేశ్‌ను ముందుకు నడిపించేందుకు తమ ప్రభుత్వానికి స్పష్టమైన దిశ, దీర్ఘకాలిక లక్ష్యం ఉందని తెలిపారు.