Chandrababu: అన్నమయ్య జిల్లాలోని రాజంపేటలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్ దిశపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ పాలనలో అర్హులైన వారికి పెన్షన్ ఇవ్వకుండా, తమ కార్యకర్తలకు మాత్రమే లబ్ధులు అందించారని తెలిపారు. ఎవరైనా ఇప్పటి వరకు పింఛను తీసుకోకపోయినా వచ్చే నెల నుంచి అందిస్తాం. నిజమైన అర్హులకే మద్దతు ఇస్తాం. అనర్హులు పింఛను తీసుకోకుండా ప్రజలే అడ్డుకోవాలి అని ఆయన స్పష్టం చేశారు.
రాయలసీమ అభివృద్ధి పట్ల తన సంకల్పాన్ని వ్యక్తం చేస్తూ, ఇక రాళ్ల సీమ అనే ముద్ర ఉండదు. రాయలసీమను రతనాల సీమగా తీర్చిదిద్దుతాం. సాగునీటితో పంటలు పండించే పరిస్థితి కల్పించాం. రైతులకు ఆత్మవిశ్వాసం కలిగించాలని మా ప్రయత్నం అని తెలిపారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే తన లక్ష్యమని చంద్రబాబు అన్నారు. “ఆదాయం పెరిగితేనే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి. అప్పులు చేసి ఎవరూ బాగుపడరు. సంపద సృష్టించే మార్గాలు చూపితేనే సంక్షేమ పథకాలు సుస్థిరంగా అమలవుతాయి” అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read: Satya Kumar: అనారోగ్య ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా
రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో సవాళ్లు ఎదురైనా 2014-19 మధ్య దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధిని చేసి చూపించామని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు స్వేచ్ఛ తిరిగి వచ్చింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు గొప్ప విజ్ఞత చూపించారు అని చంద్రబాబు పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ చేస్తున్న సంస్కరణలను ప్రస్తావిస్తూ, “దేశం ఎదగడానికి ఆ మార్గాలు అవసరం. మన రాష్ట్రం కూడా అందులో భాగస్వామి కావాలి” అన్నారు.
మహిళల భద్రతపై కఠిన వైఖరిని ప్రకటిస్తూ, “మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వారిపై కఠిన చర్యలు తప్పవు. ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడితే అదే మీ చివరి రోజు అవుతుంది” అని హితవు పలికారు. రాజంపేటలో వ్యవసాయం మార్పు దిశగా సాగుతోందని, ఉద్యానపంటలు, పశుసంపద, డెయిరీ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని చంద్రబాబు వివరించారు. అలాగే కడప, రాజంపేట మీదుగా కోడూరుకు నీరు అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాజకీయ జీవితంలో ఎప్పుడూ విశ్రాంతి తీసుకోలేదు. పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించడమే నా సంకల్పం. పేదవాడి జీవితంలో వెలుగులు నింపడం మా పార్టీ లక్ష్యం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు.

