Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. 2029 సంవత్సరం నాటికి రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనేది తమ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు 3 లక్షల ఇళ్ల గృహప్రవేశాలకు శ్రీకారం చుట్టారు. అన్నమయ్య జిల్లా, చిన్నమండెం మండలం, దేవగుడిపల్లిలో ఈ ముఖ్య కార్యక్రమాన్ని ప్రారంభించి, పలువురు లబ్ధిదారులకు ఇంటి తాళాలు అప్పగించారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోని ఇళ్ల గృహప్రవేశాలను ఆయన వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు.
‘ఇల్లు అంటే భవిష్యత్తుకు భద్రత’
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… “ఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు కాదు. అది మన భవిష్యత్తుకు భద్రత. పేదలకు తొలిసారిగా పక్కా ఇళ్లు నిర్మించిన ఘనత ఎన్టీఆర్ గారిదే. కూడు, గూడు, దుస్తులు అనే నినాదంతోనే తెలుగుదేశం పార్టీ పుట్టింది” అని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఇళ్ల లబ్ధిదారులందరికీ అభినందనలు తెలిపారు. ప్రస్తుతం పూర్తికాని మిగిలిన ఇళ్లను కూడా త్వరలోనే పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు.
మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం
ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం తెలిపారు. ముఖ్యంగా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత తనదని ఆయన ప్రకటించారు. నిన్ననే (నవంబర్ 11) ప్రకాశం జిల్లా కనిగిరిలో 97 పరిశ్రమలకు తాము పునాది వేసినట్లు గుర్తు చేస్తూ, ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలని ఆయన ఆకాంక్షించారు.

