Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకెళ్తున్నారని తెలిపారు. బుధవారం ఆయన కుప్పంలో పర్యటించి ‘స్వర్ణ కుప్పం’ ప్రాజెక్టు కింద పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.
చిరకాలంగా ప్రజలు ఎదురుచూస్తున్న హంద్రీనీవా నీటిని ఈ ఏడాదిలోనే అందిస్తామని హామీ ఇచ్చారు. రూ.3,890 కోట్ల వ్యయంతో పనులు పూర్తిచేసి, చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించనున్నట్లు వెల్లడించారు. “అభివృద్ధి చేస్తేనే సంక్షేమం మాట్లాడే హక్కు ఉంటుంది. అప్పుల మీద సంక్షేమ పథకాలు నడపడం సమంజసం కాదు” అని ఆయన విమర్శించారు.
స్వర్ణ కుప్పం కింద రూ.1292 కోట్ల అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు తెలిపారు. ఇందులో ఇప్పటికే రూ.125 కోట్ల పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. నియోజకవర్గంలోని అన్ని రహదారులను సీసీ, బీటీ రోడ్లుగా అభివృద్ధి చేయడం లక్ష్యమని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా గుంతల లేని రోడ్ల నిర్మాణమే తమ సంకల్పమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ‘దీపం 2.0’ పథకాన్ని ప్రవేశపెట్టిన చంద్రబాబు, అర్హులైన మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నట్లు చెప్పారు. దీని వల్ల ప్రతి ఇంటికి వంటగ్యాస్ అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ప్రజల ఆశీస్సులతో సుపరిపాలన అందిస్తున్నామన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు తాను కట్టుబడి ఉన్నానని పునరుద్ఘాటించారు.