Chandrababu: ప్రస్తుతంలో దుబాయ్‌లో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పాలనను సక్రమంగా కొనసాగిస్తున్నారు. విదేశీ వేదిక నుండి టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, తక్షణ సహాయక చర్యలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ప్రధానంగా వర్షాల తీవ్రత ఎక్కువగా ఉన్న నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు తక్షణ సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు రూ. 2 కోట్ల నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మిగిలిన వర్ష ప్రభావిత జిల్లాలకు ప్రతి జిల్లాకు రూ. 1 కోటి చొప్పున నిధులు కేటాయించమని తెలిపారు.
సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు, ముఖ్యమంత్రి కడప, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాలకు రాష్ట్ర విపత్తు స్పందన దళాలు (SDRF) వెంటనే తరలించాలని సూచించారు. అలాగే, నెల్లూరు జిల్లాలో పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, జాతీయ విపత్తు స్పందన దళాలు (NDRF) కూడా రంగంలోకి దించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు అందించాలన్న దిశగా కలెక్టర్లకు కూడా సూచనలు ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల భద్రతను అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని అధికారులకు గమనానికి తీసుకెళ్లారు.