Chamala Kiran: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయాలకు బలమైన దెబ్బ ఇచ్చారని, దాంతో మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి మరింతగా లూటీ చేయాలని భావించిన కేసీఆర్ కుటుంబానికి ప్రజలు కఠినంగా బుద్ధి చెప్పినట్లు వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, దుబాయ్‌లో కేదార్ అనే వ్యక్తి డ్రగ్స్ కారణంగా మృతి చెందాడని తెలిపారు. కేదార్‌కు మరియు కేటీఆర్‌కి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఆరోపించారు. దుబాయ్‌లో కేదార్ పెట్టుబడులకు వెనుకనున్నది ఎవరో చెప్పాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది అని బీఆర్ఎస్ నేతలను నిలదీశారు.
బీఆర్ఎస్ హయాంలో పదేళ్ల పాటు అసెంబ్లీ చర్చలతో కాకుండా ఎజెండా రహితంగా నడిచిందని, మంత్రులకే తెలియకుండా జీవోలు జారీ చేశారని ఆరోపించారు. తాజాగా కేంద్ర జలశక్తి శాఖ ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులను ఢిల్లీలో సమావేశానికి ఆహ్వానించిందని, నీటి పంపకాలపై చర్చించేందుకు ప్రెస్ నోట్ కూడా విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు బనకచర్ల ప్రాజెక్టుపై అనవసర విమర్శలు చేయడం విచిత్రంగా ఉందన్నారు.