Bharathi Cement: కడప జిల్లాలో భారతి సిమెంట్ కంపెనీకి లైమ్‌స్టోన్ (సున్నపురాయి) గనుల కేటాయింపుపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ కేటాయింపుల్లో అనేక అనుమానాలు ఉండటంతో, రాష్ట్ర ప్రభుత్వాన్ని విచారణ చేపట్టాలని ఆదేశించింది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు, ఫిబ్రవరిలో, ఎర్రగుంట్ల మరియు కమలాపురం ప్రాంతాల్లో మొత్తం 744 ఎకరాల లైమ్‌స్టోన్ గనులను భారతి సిమెంట్‌కు 50 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇది కొత్త అంశం కాదు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో రఘురామ్ సిమెంట్ కంపెనీ పేరుతోనే ఈ గనుల లీజుకు ప్రాధమిక ఒప్పందం జరిగింది. అయితే, అప్పట్లో ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో పూర్తి ఒప్పందం చేసుకోలేదు. ఆపై సంస్థ పేరు మారి “భారతి సిమెంట్”గా మారింది. ఇదే సమయంలో కేంద్రం మైనింగ్ నిబంధనల్లో కొన్ని సవరణలు చేయడంతో గత ఒప్పందం చెల్లదు అన్న పరిస్థితి ఏర్పడింది.
Also Read: Why Kommineni Arrested: 70 ఏళ్ల వృద్ధ జర్నలిస్టుని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది?
ఈ విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత ఒప్పందాలను తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. న్యాయ సలహా పేరుతో కొన్ని చర్యలు చేపట్టారు. కానీ, ఇందులో పెద్ద కుట్ర ఉందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ సహా పలువురు అధికారుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ కేటాయింపులపై కడపకు చెందిన ఓ వ్యక్తి కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో, కేంద్రం స్పందించింది. అప్పటికీ ఈ విషయంపై సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల్ని న్యాయాధికారుల మాటల్లో వక్రీకరించారని చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. లైమ్‌స్టోన్ కేటాయింపుల్లో ఎలాంటి అవకతవకలు జరిగాయో, లేదా నిబంధనలు ఉల్లంఘించారా అన్న అంశాలపై పూర్తి స్థాయిలో సమాధానం కోరుతోంది.