Why Kommineni Arrested: సీనియర్ జర్నలిస్టు, మాజీ ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశం అవుతోంది. అమరావతి మహిళలను కించపరిచేలా.. సాక్షి టీవీ చర్చా కార్యక్రమంలో… వాడపల్లి కృష్ణంరాజు అనే ఓ వికృత బుద్ధి కలిగిన జర్నలిస్టు.. “వేశ్యల రాజధాని” అంటూ వాగడం, ఆ వాగుడుని ముసిముసి నవ్వులతో కొమ్మినేని సమర్థించడం ఈ అరెస్టుకు మూల కారణం. ఈ వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని దెబ్బతీసినట్లు ఫిర్యాదులు రావడంతో, గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో IPC సెక్షన్ 509, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసు నమోదైంది. కొమ్మినేనిని హైదరాబాద్‌లో అరెస్టు చేసి విజయవాడకు తరలించిన పోలీసులు, కృష్ణంరాజును ఏ1గా, కొమ్మినేనిని ఏ2గా, సాక్షి యాజమాన్యాన్ని ఏ3గా చేర్చారు.
‘అమరావతి రాజధాని’ రాష్ట్రంలో సున్నితమైన అంశం. ఈ నేపథ్యంలో, కొమ్మినేని వ్యాఖ్యలు రైతులు, మహిళల ఆగ్రహాన్ని రెచ్చగొట్టాయి. సామాజిక మాధ్యమాల్లో విమర్శలు, నిరసనలు వెల్లువెత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ రోడ్డెక్కారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేష్‌లతో సహా అధికార కూటమి నాయకులు ఈ తీరును తీవ్రంగా ఖండించారు. ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజకు అమరావతి జేఏసీ ఫిర్యాదు చేయడం, టీడీపీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు జాతీయ సంఘాలకు ఫిర్యాదు చేయడం ఏపీ పోలీసులపై ఒత్తిడిని పెంచాయి.
Also Read: Ponguru Narayana: రాష్ట్రంలో రెండు కొత్త వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ పెడుతాం..
‘సాక్షి’ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అన్నది కాదనలేని వాస్తవం. అటువంటి సాక్షి వేదికగా జరిగిన ఈ చర్చా కార్యక్రమం అమరావతిని కించపరిచే దురుద్దేశంతో, పక్కా రాజకీయ ఎజెండాతో నడిచిందని ఆరోపణలు వస్తున్నాయి. ఆ పార్టీ, ఆ మీడియా కలిసి చేసిన పన్నాగంగానే అంతా భావిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిని రాష్ట్రంపై, రాజధానిపై కుట్రపూరిత చర్యగా పేర్కొన్నారు. కొమ్మినేని, ఒక సీనియర్ జర్నలిస్టుగా ఉండి కూడా జర్నలిజం నీతి నియమాలను స్పష్టంగా ఉల్లంఘించారు. మహిళలను అవమానించే వ్యాఖ్యలను ఖండించకుండా, నవ్వుతూ సమర్థించి పాత్రికేయ విలువలకు ఎగనామం పెట్టారు. గతంలో న్యాయ వ్యవస్థపైన అనుచిత కథనాలతో వివాదాస్పదుడైన కొమ్మినేని, కొన్నేళ్లుగా YSRCP ఎజెండాకు అనుగుణంగా డిబేట్లు, చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Why Kommineni Arrested: కొమ్మినేని లైవ్ షోలో పుట్టిన ఈ ద్వేషపూరిత వ్యాఖ్యలు సామాజిక అశాంతికి దారితీసే అవకాశం ఉండడంతో, శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు కాస్త ఆలస్యమైనా సరే చర్యలు తీసుకున్నారు. అత్యంత జుగుప్సాకరమైన ఈ కుహనా జర్నలిస్టుల వాఖ్యలు.. వైఎస్సార్‌సీపీ అధినేత భార్యకు కూడా వర్తిస్తాయంటూ సోషల్‌మీడియాలో మహిళలు దుమ్మెత్తి పోశారు. దీంతో భయపడిపోయిన కొమ్మినేని.. జగన్, భారతి రెడ్డిలకు క్షమాపణలు చెప్పే ప్రయత్నం చేశారు. కొమ్మినేని ఈ వ్యవహార శైలి రాష్ట్రంలో మహిళలకు మరింత ఆగ్రహాన్ని కలుగజేసింది. అవమానించింది అమరావతి ప్రాంత మహిళల్ని, రాష్ట్ర ఆడపడుచుల్ని అయితే.. క్షమాపణలు చెప్పేది నీ యజమాని భారతి రెడ్డికా అంటూ మహిళా సమాజం విరుచుకుపడింది. ఇలా.. ప్రజల ఆగ్రహం, చట్టపరమైన ఫిర్యాదులు కొమ్మినేని అరెస్టును అనివార్యం చేశాయి. ఈ అరెస్టు మహిళల గౌరవాన్ని కాపాడేందుకు, జర్నలిజం బాధ్యతలను గుర్తు చేసేందుకు.. న్యాయం గెలిచిన క్షణంగా నిలిచిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.