Dornakal Junction: రెండు తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. రైల్వే మంత్రిత్వ శాఖ తెలంగాణ రాష్ట్రంలోని డోర్నకల్ జంక్షన్ వద్ద రైల్ ఓవర్ రైల్ (RoR) ప్రాజెక్ట్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దాదాపు 10.5 కి.మీ.ల మేర నిర్మాణం జరగనున్న ఈ ప్రాజెక్ట్‌కు రూ.320 కోట్లు వ్యయం కానుంది.
రద్దీ మార్గంలో కొత్త ఊపిరి
డోర్నకల్ జంక్షన్, కాజీపేట–విజయవాడ రైల్వే విభాగంలో ఉంది. ఇది దేశంలో అత్యంత రద్దీగా ఉండే గ్రాండ్-ట్రంక్ ఉత్తర–దక్షిణ మార్గంలో భాగం. ఇప్పటికే విజయవాడ నుంచి భద్రాచలం రోడ్ వైపు బైపాస్ లైన్ నిర్మించినప్పటికీ, రైళ్లు స్టేషన్ మీదుగా క్రాసింగ్ ద్వారా వెళ్లాల్సి రావడంతో తరచూ రైళ్లు నిలిపివేయాల్సి వస్తోంది. ఫలితంగా ప్రయాణికుల సమయం వృథా కావడమే కాక, ఇతర మార్గాల రాకపోకలకు కూడా ఆటంకం ఏర్పడుతోంది.
RoR ప్రాజెక్టు పూర్తయితే ఈ సమస్య పూర్తిగా తొలగనుంది. రైళ్లు క్రాసింగ్‌లో ఆగాల్సిన అవసరం లేకుండా, ప్రత్యేకంగా నిర్మించే ట్రాక్‌పై సజావుగా కదలిక జరగనుంది. దీంతో ఈ విభాగంలో రైళ్ల వేగం, సామర్థ్యం రెండూ గణనీయంగా పెరుగుతాయి.
ఇది కూడా చదవండి: Mallikarjun Kharge: అస్వస్థతకు గురైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే
బొగ్గు రవాణాకు కూడా లాభం
ఈ ప్రాజెక్టు ప్రయాణికులకే కాకుండా సరుకు రవాణాకు కూడా కీలకంగా మారనుంది. భద్రాచలం రోడ్, పరిసర బొగ్గు బెల్ట్ ప్రాంతాల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు బొగ్గు రవాణా మరింత వేగంగా, సులభంగా జరగనుంది. దీని వలన రైల్వే ఆదాయంలో కూడా పెరుగుదల ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు తెలిపారు.
లైన్ విస్తరణ పనులకు మద్దతు
ప్రస్తుతం కాజీపేట–విజయవాడ మూడో లైన్ పనులు చివరి దశలో ఉండగా, నాలుగో లైన్ ప్రతిపాదన కూడా పురోగతిలో ఉంది. ఈ విస్తరణ పనులకు RoR ప్రాజెక్టు పూర్తి స్థాయి మద్దతు ఇస్తుందని అధికారులు స్పష్టం చేశారు.