Sanchar Saathi

Sanchar Saathi: సంచార్‌ సాథీ యాప్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం

Sanchar Saathi: దేశంలో విక్రయించే అన్ని కొత్త స్మార్ట్‌ఫోన్‌లలో ‘సంచార్ సాథీ’ అనే సైబర్ సెక్యూరిటీ యాప్‌ను ముందే ఇన్‌స్టాల్ చేసి ఉంచాలన్న తన ఆదేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు, మొబైల్ వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో, కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు, ముఖ్యంగా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్‌లను గుర్తించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఈ ‘సంచార్ సాథీ’ యాప్‌ను ప్రతిష్టాత్మకంగా రూపొందించింది. అయితే, దేశంలో విక్రయించే ప్రతి మొబైల్ ఫోన్‌లో ఈ యాప్‌ను తప్పనిసరిగా (డిఫాల్ట్‌గా) ఉంచాలని, దాన్ని అన్‌ఇన్‌స్టాల్ చేయకుండా చూడాలని కేంద్రం గతంలో మొబైల్ తయారీ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం జారీ చేసిన ఈ ఆదేశాలపై ముఖ్యంగా రెండు వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.

Also Read: Venkaiah naidu: నేను పదవి విరమణ చేశా.. పెదవి విరమణ కాదు

విపక్షాల ఆందోళన: ఈ యాప్‌ను తప్పనిసరి చేయడం వల్ల పౌరుల వ్యక్తిగత గోప్యత హక్కులకు భంగం కలుగుతుందని ప్రతిపక్షాలు, గోప్యతావాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ప్రజల డేటాపై నిఘా పెట్టడానికే ఉద్దేశించిన యాప్‌ అని, దేశాన్ని నియంతృత్వం వైపు తీసుకెళ్లడమేనని విమర్శించారు.

తయారీదారుల నుంచి వ్యతిరేకత: యాపిల్‌తో సహా పలు మొబైల్ తయారీ కంపెనీలు కూడా ఈ ఆదేశాన్ని వ్యతిరేకించాయి.

ఈ వ్యతిరేకత దృష్ట్యా, కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. కొత్త ఫోన్లలో సంచార్ సాథీ యాప్ ప్రీ-ఇన్‌స్టాలేషన్‌ను తప్పనిసరి చేయాలన్న ఆదేశాన్ని తొలగించినట్లు స్పష్టం చేసింది.

సమాచార మంత్రిత్వ శాఖ తమ ప్రకటనలో ఇంకో విషయాన్ని కూడా ప్రస్తావించింది. గత 24 గంటల్లోనే ఆరు లక్షలకు పైగా వినియోగదారులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని, వినియోగదారుల సంఖ్య వేగంగా పెరుగుతున్న కారణంగానే ఈ ప్రీ-ఇన్‌స్టాలేషన్ ఆదేశాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపింది. మొదట ఈ ఆదేశం కేవలం ప్రక్రియను వేగవంతం చేయడానికి మాత్రమే ఉద్దేశించినదని క్లారిటీ ఇచ్చింది. మొత్తం మీద, పౌరుల గోప్యతపై ఆందోళనలు, విపక్షాల విమర్శల నేపథ్యంలో కేంద్రంలోని మోడీ సర్కార్ ఈ సైబర్ సెక్యూరిటీ యాప్ విషయంలో కీలకమైన యూటర్న్ తీసుకున్నట్లయింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *