Prabhas: ప్రస్తుతం మన డార్లింగ్ ప్రభాస్ పేరు చెబితే చాలు, అది కేవలం తెలుగు సినిమాకు సంబంధించిన అంశం కాదు. ఆయన ఇప్పుడు ఒక గ్లోబల్ బ్రాండ్! ప్రభాస్ సినిమా థియేటర్లో విడుదలైతే… కలెక్షన్ల వర్షమే! ఆయన వల్లే తెలుగు సినిమా స్థాయి పాన్-ఇండియాకు చేరుకుంది. అలాంటి ఈ గ్రేట్ హీరో, సరిగ్గా 23 ఏళ్ల క్రితం, నవంబర్ 11న, తన మొదటి సినిమా ‘ఈశ్వర్’ ద్వారా వెండితెరపైకి వచ్చారు. 2002లో మొదలైన ఆయన ప్రయాణం… కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాకుండా, రీజినల్ సినిమా నుండి వరల్డ్ సినిమా స్థాయికి, రెబల్ స్టార్ నుండి ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనే కొత్త ట్యాగ్ వరకు తీసుకెళ్లింది.
ఈశ్వర్ తర్వాత వర్షం, ఛత్రపతి, డార్లింగ్, మిర్చి వంటి హిట్లతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ప్రభాస్. ఇదంతా ఒక దశ అయితే… ‘బాహుబలితో ఆయన కెరీర్ మొత్తం మారిపోయింది. ఈ ఒక్క సినిమాతోనే ప్రభాస్ పాన్-ఇండియా స్టార్‌గా మారారు. అసలు దేశంలో పాన్-ఇండియా సినిమాలకు ఒక పునాది వేసింది కూడా ‘బాహుబలి’నే! ఈ సినిమా తర్వాత, సాహో, సలార్, కల్కి 2898 AD వంటి భారీ బడ్జెట్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించారు. ఇప్పుడు కూడా రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్, సలార్ 2 లాంటి ఎన్నో క్రేజీ ప్రాజెక్టులతో ప్రభాస్ చాలా బిజీగా ఉన్నారు.
అయితే, ఇప్పటివరకు ‘రెబల్ స్టార్’ అని పిలిపించుకున్న ప్రభాస్‌కు, ఆయన అభిమానులు ఇప్పుడు కొత్త ట్యాగ్ ఇచ్చారు’ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్’.దీనికి కారణం, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, తన ‘స్పిరిట్’ సినిమా పోస్టర్‌పై ఈ ట్యాగ్‌ను వాడటం. దీంతో ఫ్యాన్స్ ఈ విషయాన్ని పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. మరి బాలీవుడ్లో పెద్దపెద్ద ఖాన్లు ఉన్నప్పుడు, ప్రభాస్ ‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్’ ఎలా అవుతాడు? అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కానీ… ప్రభాస్ సినిమాల రికార్డులు, దేశంలోనే అతి ఎక్కువ కలెక్షన్లు సాధించడం, మొదటి రోజు భారీ ఓపెనింగ్స్‌ను ఒకసారి పరిశీలిస్తే… ఆయనే ఆ ట్యాగ్‌కు సరిపోతారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు! ఆయన స్టార్డమ్ ఇప్పుడు ఇండియా సరిహద్దులు దాటిపోయింది.

