Bollywood: ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కొరియోగ్రాఫర్, దర్శకుడు రెమో డిసౌజా, అతని భార్య లిజెల్ డిసౌజాతోపాటు మరో ఐదుగురిపై మోసం చేసినందుకు కేసు నమోదైంది. ఈ మేరకు శనివారం ఒక ఫిర్యాదు వచ్చినట్లు ముంబైలోని థానే పోలీసులు తెలిపారు. రెమో, అతని భార్య, ఇతర వ్యక్తులు కలిసి రూ.11.96 కోట్ల మోసానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రెమో డిసౌజా, అతని భార్య లీజెల్, మరో ఐదుగురిపై 26 ఏళ్ల డ్యాన్సర్ ఈ ఆరోపణ చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. బాధిత డ్యాన్సర్ అక్టోబర్ 16న ముంబైలోని మీరా రోడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు రెమో డిసౌజాతో పాటు మరో 6 మందిపై సెక్షన్లు 465 (ఫోర్జరీ), 420 (మోసం) సహా ఇండియన్ జస్టిస్ కోడ్‌లోని ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఫిర్యాదు ప్రకారం..బాధిత డాన్సర్ కి 2018, జూలై 2024 మధ్య మోసం జరిగింది. తన టీం టీవీ షోలో విజయం సాధించింది. రెమో సహా ఇతర నిందితులు ఆ గ్రూప్ తమదేనన్నట్లుగా బిల్డప్ ఇచ్చి వారు గెలుచుకున్న రూ.11.96 కోట్ల ప్రైజ్ మనీని లాక్కున్నారని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో రెమో డిసౌజా, లీజెల్ డిసౌజాతో పాటు ఓం ప్రకాష్ శంకర్ చౌహాన్, రోహిత్ జాదవ్, ఫ్రేమ్ ప్రొడక్షన్ కంపెనీ, వినోద్ రౌత్, రమేష్ గుప్తా అనే వ్యక్తిని పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు.