IND vs AUS: గతంలో ఆస్ట్రేలియాతో టీమిండియా టెస్టు సిరీస్ అంటే ఓటమే అన్నట్లుగా ఉండేది. ఎంత తేడాతో ఓడాం అన్నదే చూసే వాళ్లు..అప్పట్లో సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజాలున్నా..ఆయా తరాల్లో అత్యుత్తమ ఆటగాళ్లతో కంగూరు గడ్డపై అడుగుపెట్టినా మనకు విజయాలు దక్కలేదు.. కానీ 2018 తర్వాత సీన్ మారింది… ఇప్పటివరకు ఒక లెక్క..ఇప్పటి నుంచి మరోలెక్క అన్నట్లుగా వరుసగా ఆసీస్ గడ్డపై రెండు టెస్టు సిరీస్ విక్టరీలు అందుకుంది. ముచ్చటగా మూడోసారి ఆసీస్ ను వారిగడ్డపై చిత్ చేస్తుందా ..? లేదా అన్నది తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ..
2018 ముందు వరకు ఆస్ట్రేలియా గడ్డపై మనం పోరాడితేనే గొప్ప అన్నట్లుగా సాగింది. భారీ తేడాతోనే లేకపోతే ఇన్నింగ్స్ పరాజయన్నో నిలువరిస్తే చాలు టీమిండియా అభిమానులు మురిసిపోయేవాళ్లు.. ఎందుకంటే అప్పటికి ఆస్ట్రేలియాకు ఓటమి అంటే తెలియని అజేయ జట్టు. కానీ ఇదంతా 2018 వరకే.. ఆ ఏడాది చివర్లో మొత్తం కథ మారిపోయింది. సంచలన సిరీస్ విజయంతో కంగారు గడ్డపై వైఫల్యాల చరిత్రకు టీమిండియా ముగింపు పలికింది . కోహ్లీ సారథ్యంలోని భారత్ వారి సొంతగడ్డపై ఆసీస్ ను ఓడించింది.
మరో రెండేండ్ల అనంతరం మరో అద్భుత విజయంతో ఆసీస్ జట్టును ఇంకా పెద్ద దెబ్బ తీసింది. రెండేళ్లు గడిచాయి. ఇప్పుడు మళ్లీ ఆస్ట్రేలియాలో టీమిండియా అడుగు పెట్టింది. మరి ముచ్చటగా మూడోసారి ఆస్ట్రేలియాకు వారి గడ్డపై మనోళ్లు చెక్ పెట్టగలరా..? అంటే గతంలోని సందేహాలు మళ్లీ ఇప్పుడు ముసురుకున్నాయి. మన సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్..తొలిటెస్టుకు అందుబాటులో లేని కెప్టెన్ రోహిత్..గాయం బారిన గిల్ పడడంతోనే ఫ్యాన్స్ ఈసారి గెలుపు సందేహమనే అంటున్నారు. అంతేకాదు పేసర్ షమీ అందుబాటులో లేకపోవడంతో పేస్ బౌలింగ్ లో వాడి తగ్గిన పరిస్థితులు..జడేజా, అశ్విన్ వికెట్లు తీయడంలో వెనుకంజ..వెరసి భారత్ గెలుపుపై సందేహాలు వ్యక్తమవుతున్న పరిస్థితి.
ఇది కూడా చదవండి: Mike Tyson: మైక్ టైసన్ బౌట్.. నెట్‌ఫ్లిక్స్ ఔట్..!
IND vs AUS: ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించడం అసాధ్యం అని బలంగా నాటుకుపోయిన అభిప్రాయానికి 2018-19 సీజన్లో కోహ్లీసేన 2-1 గెలుపుతో చరమగీతం పాడితే.. రెండేళ్ల తర్వాత అనేక ప్రతికూలతల మధ్య రహానె సారథ్యంలోని జట్టు అసాధారణ విజయాన్నందుకుంది. కోహ్లి, షమి లాంటి కీలక ఆటగాళ్లు తొలి టెస్టు మినహా సిరీస్‌కు అందుబాటులో లేకపోయినా, తొలి టెస్టులో 36 పరుగులకే కుప్పకూలి ఘోర పరాభవం ఎదుర్కొన్నా.. తర్వాత గొప్పగా పుంజుకుని సిరీస్ విజయం సాధించింది. ఆ విజయం టీమ్‌ఇండియాకు ఎప్పటికీ స్ఫూర్తినిచ్చేదే.
అయితే ఈసారి ఆస్ట్రేలియాలో సిరీస్ ముంగిట భారత్ ఏమంత ఆత్మవిశ్వాసంతో కనిపించడం లేదు. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్‌కు గురి కావడంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. రోహిత్, కోహ్లి, రాహుల్ లాంటి సీనియర్లు ఫామ్‌లో లేరు. షమి అందుబాటులో లేడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే 4-0తో సిరీస్ గెలవాల్సిన భారత్.. అది సాధించాలంటే అసాధారణ ప్రదర్శన చేయాల్సిందే. కానీ ఆస్ట్రేలియా గత రెండు సార్ల మాదిరిగా అంత తేలిగ్గా లొంగేలా లేదు.
ఆస్ట్రేలియా జట్టులో మ్యాచ్ విన్నర్లకు కొదవలేదు. అందరి కంటే స్టీవ్ స్మిత్‌తో మనకు ఎక్కువ ప్రమాదం రానుంది. గతంలో మన ఆసీస్ టూర్ లో బాల్ టాంపరింగ్ వివాదం వల్ల ఒక రెండేళ్లు స్మిత్ ఇబ్బంది పడ్డాడు కానీ.. అంతకుముందు అతనెలా పరుగుల వరద పారించాడో అందరికీ తెలిసిందే. అంతేకాదు టీమిండియా అంటే చాలు రెచ్చిపోతాడు. 2014 సిరీస్ సందర్భంగా ఏకంగా నాలుగు సెంచరీలు చేసి మనపై పూర్తి ఆధిపత్యం చూపించినా.. గత రెండు సిరీస్‌ల్లో మాత్రం ఓ మోస్తరు ప్రదర్శన చేశాడు.
గత ఏడాది ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లోనూ టీమిండియాపై సెంచరీ కొట్టి ఆసీస్ జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్ గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు మనల్ని ముంచే..మనకు షాకిచ్చే వారిలో ట్రావిస్ హెడ్ ప్రధానం. గతేడాది డబ్ల్యూటీసీ ఫైనల్లో, వన్డే ప్రపంచకప్ ఫైనల్లోనూ మనలను కొట్టిన దెబ్బను ఎప్పటికీ మరిచిపోలేం.. వీరిద్దరూ పూర్తిస్థాయి ఫాంలో ఉండడంతో పాటు భారత బౌలింగ్ వీరిని ఏమాత్రం నిలువరిస్తుందో అన్నదానిపైనే మన విజయావకాశాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: SL vs NZL: న్యూజిలాండ్ పై శ్రీలంక రికార్డ్ విజయం!
IND vs AUS: ఇక ఆసీస్ జట్టు ఓపెనింగ్‌లో ఉస్మాన్ ఖవాజా, మూడో స్థానంలో లబుషేన్ లాంటి నిలకడైన బ్యాటర్లున్నారు. మిడిలార్డర్లో హెడ్, వికెట్ కీపర్ అలెక్స్ కేరీ కీలక పాత్ర పోషించగలరు. ఇక బౌలింగ్‌లో ఆసీస్‌కు తిరుగులేదు. కెప్టెన్ కమిన్స్‌కు తోడు స్టార్క్, హేజిల్‌వుడ్‌లను ఎదుర్కోవడం అదీ కంగారు గడ్డపై అంటే మాటలు కాదు. అంతేకాదు మరో పేసర్ బోలాండ్ కూడా మాంచి ఊపుమీదున్నాడు. ఆస్ట్రేలియా తుది జట్టులో నాథన్ లైయన్ రూపంలో ఒకే స్పిన్నర్‌కు అవకాశమిస్తుంది కానీ.. ఆ ఒక్కడూ మామూలోడు కాదు. పిచ్ ఎలాంటిదైనా టర్న్ చేసి వికెట్లు తీయగల సామర్థ్యం అతని సొంతం.
అంతేకాదు లోయరార్డర్లో ఆడే కమిన్స్, స్టార్క్ నిప్పులు చెరిగే బంతులే కాదు ..బ్యాటింగ్‌లోనూ రాణించగలరు. ఆసీస్‌కు సిరీస్‌లో ఏకైక సమస్య అంటతే ఖవాజాకు సరైన ఓపెనింగ్ భాగస్వామి లేకపోవడమే. వార్నర్ రిటైరయ్యాక.. స్మిత్‌ను ఆ స్థానంలో ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. భారత్‌తో సిరీస్ కోసం కొత్త కుర్రాడు మెక్‌స్వీనీకి అవకాశమిచ్చారు. ఈ ఒక్కటి తప్ప ఆసీస్ జట్టు అంతా బాగానే ఉంది. దీంతోపాటు సొంతగడ్డపై వరుసగా రెండు సిరీస్ ల పరాజయ పరంపరకు బ్రేక్ వేయాలన్న పట్టుదలతో కంగారూ టీమ్ సమరానికి సై అంటోంది. సొంతగడ్డపై ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియా జట్టు అద్భుతంగా ఆడుతోంది. తన చివరి మూడు టెస్టు సిరీస్ లను సొంతగడ్డమీదే ఆడింది.
వెస్టిండీస్‌తో సిరీస్ 1-1తో సమం కాగా.. అంతకుముందు న్యూజిలాండ్, పాకిస్థాన్‌లపై సిరీస్‌లను క్లీన్‌స్వీప్ చేసింది. అంతకంటే ముందు ఇంగ్లాండ్‌లో యాషెస్ సిరీస్‌ను 2-2తో సమం చేసింది. అయితే ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో సిరీస్ ఆడాక ఆసీస్ టెస్టులే ఆడలేదు. ఏకంగా తొమ్మిది నెలల విరామం తర్వాత.. భారత్‌తో కీలక సిరీస్‌కు సిద్ధమైంది. ఆ జట్టు ఆటగాళ్లు ఇతర ఫార్మాట్లలో రాణిస్తూ మంచి లయలోనే ఉన్నారు. అంతేకాదు టెస్టుల్లో ఆస్ట్రేలియా భీకర ఫాంలో ఉంది.
దశాబ్దాలుగా టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లడం ..ఓటమితో తిరిగి రావడం షరా మామూలే. అయితే గత రెండు పర్యాయాలు మాత్రం విజయాలతో సిరీస్ గెలుపుతో సగర్వంగా మనోళ్లు తిరిగొచ్చారు. దీంతో ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచం అవాక్కైంది. 2018-19లో కోహ్లి నాయకత్వంలోని జట్టు ఆస్ట్రేలియాను 2-1తో ఓడించింది. ఈ సిరీస్ లో భాగంగా అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాకు పెద్ద షాకే తగిలింది. మొదట భారత్ 250 పరుగులకే పరిమితమైంది. పుజారా 123 పరుగులతో అద్భుత సెంచరీతో మెరిసాడు. ఆతర్వాత భారత బౌలర్లు సమిష్టిగా సత్తా చాటి తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్‌ను 235కే ఆలౌట్ చేశారు. రెండో ఇన్నింగ్స్ లోనూ పుజారా 71 పరుగులతో మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడగా.. రహానె 70 పరుగులతో అతను కూడా రాణించడంతో భారత్.. ఆస్ట్రేలియా ముందు 323 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బుమ్రా, అశ్విన్, షమి తలో మూడు వికెట్లు తీయడంతో ఆసీస్ 291కే ఆలౌటై 31 పరుగుల తేడాతో ఓడింది.
అనంతరం పేస్ స్వర్గధాయం పెర్త్‌లో జరిగిన రెండో టెస్టులో బలంగా పుంజుకున్న ఆసీస్ 146 పరుగుల విజయం సాధించింది. ఇక మూడో టెస్టులో టీమిండియా మళ్లీ జూలు విదిల్చింది. 137 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. 106 పరుగులతో పుజారా సెంచరీకి తోడు టీమిండియా పేస్ గుర్రం బుమ్రా 6 వికెట్లు తీసుకుని అద్భుత బౌలింగ్ చేయడంతో టీమిండియా విజయం సాధించింది. ఇక చివరి టెస్టులోనూ భారత్ గెలవాల్సింది కానీ.. వర్షం కారణంగా ఆసీస్ డ్రాతో గట్టెక్కింది. దీంతో టీమిండియా కోహ్లీ సారథ్యంలో ఆసీస్ గడ్డపై తొలి సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించింది.
IND vs AUS: 2020-21లో భారత్ సాధించిన సిరీస్ విజయం మరింత గొప్పగా నిలిచింది. ఎందుకంటే అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 36 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్ తర్వాత భార్య ప్రసవం కోసం కోహ్లి సిరీస్‌కు దూరమయ్యాడు. గాయంతో షమి వైదొలిగాడు. ఈ స్థితిలో రహానె నాయకత్వంలో అసామాన్య ఆటతో సిరీస్ సాధించింది భారత్. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 195కే ఆలౌట్ చేయడం సిరీస్‌లో కీలక మలుపు. తర్వాత తొలిఇన్నింగ్స్ లో రహానె 112 పరుగులతో సెంచరీ చేసి జట్టును ముందుండి నడిపించాడు. దీంతో భారత్ 326 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ బౌలర్లు ఆసీస్‌ను 200కే పరిమితం చేశారు. 70 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లే కోల్పోయి ఛేదించి సిరీస్‌ను సమం చేసింది భారత్.
సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో భారత్ ముందు 407 పరుగుల లక్ష్యం నిలవగా.. చివరి రోజు ఇంకా సగం ఆట మిగిలుండగా భారత్ 5 వికెట్ల నష్టానికి 272 పరుగులతో ఓటమి అంచున నిలిచింది.ఓటమి లాంఛనమే అనుకున్న దశలో 161 బంతుల్లో విహారి 23 నాటౌట్, 128 బంతుల్లో అశ్విన్ 39 నాటౌట్ తో అసలైన టెస్టు మజాను అందించారు. అద్భుత పోరాటంతో గాయాలకు వెరవకుండా ..భీకర ఆసీస్ బౌలింగ్ ను అడ్డుకుని టీమిండియాకు ఓటమి తప్పించారు. చివరి టెస్టులో 328 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో 5 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసిన దశలో 22 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్ సహకారంతో 89 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్ తో యంగ్ రిషభ్ పంత్ గొప్పగా పోరాడి జట్టుకు చిరస్మరణీయ విజయం అందించాడు. దీంతో వరుసగా రెండోసారి ఆసీస్ గడ్డపై భారత్ సిరీస్ విక్టరీ కొట్టింది. మరి ఈసారి భారత్ ఎలా పోరాడుతుందో గతంలో జరిగిన అద్భుతాన్ని మళ్లీ రిపీట్ చేస్తుందో లేదో చూడాల్సిందే.