Bangladesh T20 League: ఏదైనా దేశంలో క్రికెటర్లు అంటే అభిమానులకు ఎంతో గౌరవం, ప్రేమ ఉంటాయి. అలాగే బంగ్లాదేశ్ లో కూడా. అయితే ఒక్క క్రికెట్ అభిమానులతో పాటు మిగిలిన వారికి కూడా వాళ్ళ ఆటగాళ్లు అంటే లెక్కలేనంత అభిమానం ఉంటుంది. అది ఎంతలా అంటే వారి క్రికెట్ కిట్లు దాచిపెట్టేసి డబ్బులు చెల్లించమని డిమాండ్ చేసేంత..! మరి అసలు ఈ వింత సమస్య ఎందుకు వచ్చింది అనే వివరాల్లోకి వెళితే…
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ అనగా మన ఐపీఎల్ లాగా అక్కడ జరిగే బీపీఎల్ క్రికెట్ టోర్నీలో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. ఆ కారు చిచ్చు ఇంకా చల్లారక ముందే ఇప్పుడు తాజాగా చెల్లింపుల సమస్య తలెత్తింది. దర్బార్ రాజ్‍షాహి ఫ్రాంచైజీ ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్‌కు చెల్లింపులు ఆలస్యం చేస్తోందన్న వసంతాల మధ్యలో ఇప్పుడు మరో వివాదం పుట్టింది.
ఈ మధ్య బాగా వివాదంలో చిక్కుకున్న దర్బార్ రాజ్‍షాహి ఫ్రాంచైజీ వారు బస్ డ్రైవర్‌కు కూడా చెల్లింపులు చేయలేదు. బకాయిలు ఉండిపోవడంతో, ఆ డ్రైవర్ ఆటగాళ్ల కిట్ బ్యాగ్‍లను దాచేశాడు. తనకు డబ్బు ఇచ్చిన తర్వాతే కిట్ బ్యాగ్‍లు తిరిగి ఇస్తానని ఆయన చెప్పారని కొన్ని వార్తా సంస్థలు వెల్లడించాయి.
బకాయిలు చెల్లించిన తర్వాతే కిట్లు ఇచ్చి వెళ్లిపోతానని ఆ డ్రైవర్ అన్నాడు. “ఇది సిగ్గుపడాల్సిన విషయం. మాకు చెల్లింపులు చేస్తే ఆటగాళ్లకు కిట్ బ్యాగ్‍లు ఇస్తాం. ఇప్పటివరకు నేను మౌనంగా ఉన్నాను. మా బకాయిలు చెల్లించిన తర్వాత మేం వెళ్లిపోతాం” అని కిట్లు దాచేసిన డ్రైవర్ మహమ్మద్ బాబుల్ చెప్పాడని ఒక రిపోర్ట్ వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Virat Kohli: ఫ్యాన్స్ తిట్టినా… అతనిని కోహ్లీ మాత్రం మెచ్చుకున్నాడు..!
కొందరు విదేశీ ఆటగాళ్లకు కూడా చెల్లింపులు జరగలేదని తెలుస్తోంది. దీంతో, వారు ఢాకాలోని ఓ హోటల్‍లో ఉన్నారు. ఇకపోతే వారికి కూడా టీమ్ మేనేజ్‍మెంట్ సరైన సమాచారాన్ని ఇవ్వలేదని సమాచారం. ఈ సీజన్‌లో దర్బార్ రాజ్‍షాహి జట్టు ఇప్పటికే ఎలిమినేట్ అయిపోయింది. అయినప్పటికీ, మహమ్మద్ హారిస్, అఫ్తాబ్ ఆలం, మార్క్ డేయల్, ర్యాన్ బర్ల్ వంటి ప్లేయర్లు ఇప్పటికీ తమ చెల్లింపుల కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు ప్లేయర్లకు పావు భాగం చెల్లించగా, మరికొందరికి ఏమీ ఇవ్వలేదని తెలుస్తోంది.
చెల్లింపుల సమస్యతో ఆటగాళ్లు దర్బార్ రాజ్‍షాహి మేనేజ్‍మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం స్పష్టత కూడా ఇవ్వకుండా చిక్కుల్లో పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. కొందరు బంగ్లాదేశీ ఆటగాళ్లు ఈ ఫ్రాంచైజీపై గుర్రుగా ఉన్నారు. విదేశీ ఆటగాళ్లు చెల్లింపులు లేకుండా తమ దేశాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈ జట్టు వ్యవహారాలపై విచారణ జరుపుతోంది.